వదినను ఎందుకు కొట్టావని నిలదీస్తే.. అన్ననే హతమార్చాడు..!
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి కుమారుడి పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగడం శోచనీయం.
వదినను ఎందుకు కొట్టావని ప్రశ్నించినందుకు అన్ననే హతమార్చాడు ఓ తమ్ముడు. బండరాయితో తలపై మోది మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి కుమారుడి పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగడం శోచనీయం.
న్యూ ఇందిరా నగర్‌లోని గుట్టపై ముగ్గురు సోదరులు గుమ్మడి చంద్రమోహన్, ఆంజనేయులు (45), సురేష్ కుమార్‌లకు ఉమ్మడిగా ఇల్లు ఉంది. దానిని ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత చంద్రమోహన్ బడంగ్ పేట్‌కు మకాం మార్చాడు. సురేష్‌కుమార్‌కు చెందిన గది శిథిలావస్థకు చేరడంతో అన్న చంద్రమోహన్‌కు చెందిన గదిలో ఉంటున్నాడు.
ఆంజనేయులు ఆ గది పక్కనే భార్యాపిల్లలు, తల్లితో కలసి ఉంటున్నాడు. సురేష్‌కుమార్ కల్లుకు బానిసయ్యాడు. ఆ క్రమంలో మతిస్థిమితం కోల్పోయాడు. చుట్టుపక్కల వారితో ఎప్పుడూ ఘర్షణకు దిగుతుండేవాడు. అన్న ఆంజనేయులును చంపుతానంటూ ఏడాది నుంచి బెదిరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన సురేష్‌కుమార్.. ఐదు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు.
బుధవారం ఉదయం ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై వదిన ఇందిర నీళ్లు వేడి చేస్తోంది. పొగ వస్తోందంటూ ఆగ్రహించిన సురేష్ ఆమెపై దాడికి దిగాడు. దీంతో మండిపడిన ఇందిర.. 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులు అక్కడికి చేరుకోగా, అప్పటికే సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గురువారం సురేష్ ఇంటికి తిరిగి రాగా.. అతని అన్న ఆంజనేయులు కర్ర, కారం పొడి తీసుకొని.. తన భార్యను ఎందుకు కొట్టాడో నిలదీసేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణలో సురేష్ అన్నను గ్రానైట్ రాయితో తలపై మోదాడు. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. వాడికి మతిస్థిమితం లేదు.. వాడి జోలికెళ్లొద్దని చెప్పినా వినలేదంటూ.. మృతుడి తల్లి భోరున విలపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.