ప్రేమోన్మాది ఘాతుకం.. - యువతిపై హత్యాయత్నం
యువతి కేకలు వేయడంతో కంగారుపడిన నిందితుడు స్థానికులు వచ్చేసరికే అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై ఘాతుకానికి తెగబడ్డాడు. ఆమెను హతమార్చేందుకు యత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బొద్దుల సాయి అనే యువకుడు.. కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. గురువారం యువతి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన నిందితుడు.. ఆమె ఇంటికి వెళ్లి.. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. యువతి భయంతో కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
యువతి కేకలు వేయడంతో కంగారుపడిన నిందితుడు స్థానికులు వచ్చేసరికే అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.