తెలంగాణకు ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలకు అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది ఇంకా అల్లాడిపోతోంది. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం అలాంటి ప్రమాదమేమీ లేదు. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సోమవారం ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా మెండోరా(నిజామాబాద్ జిల్లా)లో 1.9 సెంటీమీటర్లు, భైంసా(నిర్మల్)లో 1.2 సెం.మీ., గోదూరు(జగిత్యాల)లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి సహా.. ఇటు దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ వరకు వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో.. మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దికారు.
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై కూడా మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతుండటంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోస్తా జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.