Telugu Global
Telangana

సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా.. నేనే ఇక్కడ పనిచేస్తా..

ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌, రోడ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ ఎల్లారెడ్డి, కామారెడ్డి.. తెలంగాణలోనే నెంబర్‌-1 గా మారేలా అందరూ గర్వపడేలా చేస్తానన్నారు కేసీఆర్.

సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా.. నేనే ఇక్కడ పనిచేస్తా..
X

సాగునీరు, తాగునీరు విషయంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి కాస్త వెనుకబడి ఉన్నాయని, అందుకే తాను కామారెడ్డికి వచ్చానని చెప్పారు సీఎం కేసీఆర్. కామారెడ్డిలో పోటీ చేస్తున్నానంటే ఎల్లారెడ్డి వేరే కాదని, రెండింటికి కలిపి ఎమ్మెల్యేగా తానే ఉన్నట్టు లెక్క అని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్‌ తనకు తమ్ముడు లాంటివాడని, కుటుంబ సభ్యుడిలాగా ఉంటాడని చెప్పారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పని చేసిన వ్యక్తి సురేందర్ అని గుర్తు చేశారు. ఎల్లారెడ్డిలో సురేందర్‌ ఎమ్మెల్యేగా ఉన్నా తానే పని చేస్తానన్నారు. ఇక్కడ అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మాండమైన అభివృద్ధిని చూడబోతున్నారని చెప్పారు. ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌, రోడ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ ఎల్లారెడ్డి, కామారెడ్డి.. తెలంగాణలోనే నెంబర్‌-1 గా మారేలా అందరూ గర్వపడేలా చేస్తానన్నారు కేసీఆర్. బీఆర్‌ఎస్‌ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


ఓటు ఆషామాషీగా వేయొద్దని, గ్రామంలోని పెద్దలంతా కూర్చొని విచారించి రాయేదో రత్నమేదో గుర్తుపట్టి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. అలా జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజాస్వామిక పరిణితి పెరుగుతుందని, మంచి ఫలితాలు వస్తాయని, దేశం బాగుపడుతుందని, గెలిచిన ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం అని అన్నారు కేసీఆర్.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. పేదలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో పటిష్టమైన వ్యవసాయ స్థిరీకరణ కోసం ప్రణాళిక తయారు చేసుకున్నామని వివరించారు. వ్యవసాయంతోపాటు ఐటీరంగం, పారిశ్రామికరంగం ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నీ ఒక్కొక్కటీ చేసుకుంటూ వచ్చామన్నారు.

First Published:  15 Nov 2023 7:53 PM IST
Next Story