టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఇష్టానుసారం మాట్లాడారని.. ఆయన కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని యాదవులు ఫైర్ అవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదవులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఇష్టానుసారం మాట్లాడారని.. ఆయన కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని యాదవులు ఫైర్ అవుతున్నారు. 'దున్నపోతు పేడను పిసుక్కునే వాడివి' అంటూ మంత్రిని పట్టుకొని మాట్లాడతారా.. ఇది గొల్ల కురుమలను, వారి వృత్తిని కించపరచడమే అని వారు అంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గొల్లకురుమలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారీ ర్యాలీ నిర్వహించి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పేడను పూశారు. రేవంత్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను కూడా ముట్టడిస్తామని యాదవ సంఘ నాయకుడు బైకాను శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బీసీ కులస్థులను అవమానపరిచే విధంగా రాజకీయ నాయకులు ఎవరు వ్యాఖ్యలు చేసినా.. అందరూ ఏకమై బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో యాదవ కురుమ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ మాట్లాడుతూ యాదవ, కురుమ వృత్తులను కించపరిచేలా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను వ్యక్తిగతంగానే కాకుండా.. యాదవ, కురుమ కులస్థులను కూడా కించపరిచారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
అందరం వ్యవసాయం చేసుకునే వాళ్లమే.. రేవంత్ రెడ్డి తన మూలాలను మరిచిపోయి మాట్లాడుతున్నారని రాజారాం అన్నారు. ఇది రేవంత్ రెడ్డి వైఖరా.. లేదంటే కాంగ్రెస్ పార్టీ వైఖరా స్పష్టం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ వ్యతిరేక పార్టీ అని ఇప్పటికే ముద్ర ఉన్నది.. ఇప్పటికైనా బీసీ వైపు ఉండాలని రాజారాం సూచించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.