యాదగిరిగుట్టకు రికార్డు స్థాయి ఆదాయం.. ఎంతో తెలుసా..?
ప్రసాదం అమ్మకాల ద్వారా అత్యధికంగా రూ.41 కోట్లు రాగా..హుండీ ద్వారా రూ.32 కోట్లు వచ్చాయి. ఇక ఆర్జిత సేవ ద్వారా రూ.10 కోట్లు, వీఐపీ దర్శనం ద్వారా మరో 10 కోట్ల రూపాయలు చేకూరాయి.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మినరసిహస్వామి దేవాలయ ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో దాదాపు రూ.225 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ గుడిని పునర్‌నిర్మించి 2022లో ప్రారంభించగా...ఈ ఏడాదే అత్యధిక ఆదాయం సమకూరింది.
2023-24 మధ్య కాలంలో వచ్చిన ఆదాయం వివరాలను ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. 2022-23 మధ్య కాలంలో రూ.169 కోట్లు భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించగా 2023-24 మధ్యకాలంలో రూ.224.25 కోట్ల ఆదాయం వివిధ రూపాల్లో వచ్చి చేరింది. ఇందులో ప్రసాదం అమ్మకాల ద్వారా అత్యధికంగా రూ.41 కోట్లు రాగా..హుండీ ద్వారా రూ.32 కోట్లు వచ్చాయి. ఇక ఆర్జిత సేవ ద్వారా రూ.10 కోట్లు, వీఐపీ దర్శనం ద్వారా మరో 10 కోట్ల రూపాయలు చేకూరాయి.
ఏటా పెరుగుతున్న భక్తుల కోసం సౌకర్యాలు పెంచేందుకు ఆదాయాన్ని వినియోగిస్తామంటున్నారు ఆలయ అధికారులు. అయితే ఆదాయం విషయంలో తెలంగాణలోని దేవాలయాల్లోకెల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ టాప్‌లో నిలిచింది.