Telugu Global
Telangana

కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు.. ఉత్తుత్తి కరెంట్

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వారిద్దరికీ ప్రత్యేకంగా ఓ బస్సు పెడతామని, మంచిగా బిర్యానీ కూడా పెడతామని, ఆ బస్సులో వచ్చి ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలానికైనా వెళ్లి కరెంటు వైర్లు పట్టుకోవాలని రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా పోతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్.

కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు.. ఉత్తుత్తి కరెంట్
X

తెలంగాణలో రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. 3 గంటల కరెంటు అంటూ ఆల్రడీ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. అందుకే మేనిఫెస్టోలో 24గంటల కరెంటు అనే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇటీవల కాంగ్రెస్ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. అసలు ఉచిత కరెంటు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్‌ కాదని, ఉత్తుత్తి కరెంట్‌ అని ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన రోడ్ షో లో పాల్గొన్న కేటీఆర్... ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. వారిద్దరికీ ప్రత్యేకంగా ఓ బస్సు పెడతామని, మంచిగా బిర్యానీ కూడా పెడతామని, ఆ బస్సులో వచ్చి ఆలేరు నియోజకవర్గంలో ఏ మండలానికైనా వెళ్లి కరెంటు వైర్లు పట్టుకోవాలని రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా పోతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. 10 హెచ్.పి. మోటార్లు కావాలంటున్నారని, రైతుల్లో ఎంతమందికి అలాంటి మోటర్లు ఉన్నాయని ప్రశ్నించారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు.

వరి సాగులో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నెంబర్-1 గా ఉందని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో తాగు, సాగునీటి కష్టాలు లేనే లేవన్నారు. రాబందుల లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. 55 ఏళ్లలో సాధ్యం కానిది ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. 11 సార్లు అవకాశమిస్తే కాంగ్రెస్ వాళ్లు ఏం పీకారని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పుడు ఏం పీకడానికి వారికి ఓటు వేయాలన్నారు. భూమికి 2 అడుగులు లేని రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ని తిడతారా అని సెటైర్లు పేల్చారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండేదో ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. గొంగిడి సునీతకు భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు కేటీఆర్. దరిద్రానికి నేస్తం హస్తం అని, ఆ దరిద్రాన్ని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవద్దని యాదగిరిగుట్ట వాసులకు సూచించారు.



First Published:  20 Nov 2023 11:12 AM GMT
Next Story