Telugu Global
Telangana

ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం యాదాద్రి.. అవార్డుపై కేసీఆర్ హర్షం..

స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని అన్నారు సీఎం కేసీఆర్.

ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం యాదాద్రి.. అవార్డుపై కేసీఆర్ హర్షం..
X

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం (గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్) అనే అవార్డు దక్కింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2022-25 సంవత్సరాలకు గాను ఈ అవార్డు కోసం యాదాద్రిని ఎంపిక చేసింది. ఈ అవార్డుపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని కేసీఆర్ అన్నారు. ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులకు లభించిన అరుదైన గౌరవం ఇదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజల పై ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు సీఎం కేసీఆర్.

ఎందుకీ అవార్డు..?

హరిత పుణ్యక్షేత్రం పేరులోనే దీనికి సంబంధించిన వివరణ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ అవార్డులను ఇస్తోంది. అయితే పురాతన ఆలయానికి ఇటీవల చేసిన మరమ్మతులకు గాను ఈ అవార్డు లభించింది. ఆలయ విశిష్టత, ప్రాచీన కళా సంపదకి నష్టం లేకుండా పునర్నిర్మాణం జరగడం ఇక్కడ విశేషం.

యాదాద్రి పునర్నిర్మాణ ప్రత్యేకతలు..

  • 13వ శతాబ్దానికి చెందిన శ్రీయాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ దేవాలయ స్వయంభూ పవిత్రతకు భంగం వాటిల్లకుండా, స్వయం భువుని ఏ మాత్రం తాకకుండా ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ నిర్మాణం చేపట్టారు.
  • ఆలయం లోపల, బయట శిలలను సంరక్షణ చేశారు. ఆలయం మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్ విధానం, గోడలకు నష్టం లేకుండా ఆలయ వాహిక నిర్మాణం జరిగింది.
  • "సూర్య వాహిక" ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ సూర్య కాంతి ప్రసారం జరిగేలా ప్రత్యేక నిర్మాణం. స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీలు ఏర్పాటు చేశారు.
  • ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ నిర్మాణాలకోసం కృష్ణశిలను ఉపయోగించారు. దీనివల్ల ఆలయంలో సహజమైన చల్లదనం ఏర్పడుతుంది.
  • పచ్చదనంతో కూడిన పరిసరాలు, స్వచ్ఛమైన తాగునీటి లభ్యత, చెరువుల నిర్మాణం, వాహనాలకు అనువైన పార్కింగ్ స్థలం, నిరంతరం రవాణా సేవల అందుబాటులో ఉన్నాయి.
  • ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఉండబట్టే యాదాద్రికి ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం అనే అవార్డు లభించింది.
First Published:  21 Oct 2022 7:03 AM IST
Next Story