తప్పుడు నివేదిక ఇచ్చినందుకు యాదాద్రి అడిషనల్ కలెక్టర్ సస్పెండ్
యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే నల్గొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) భాస్కరరావు సస్పెండయ్యారు. తప్పుడు నివేదిక ఇచ్చారని ఆగ్రహించిన ఎన్నికల కమిషన్ ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ రెవెన్యూశాఖ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
నాలుగేళ్లుగా పనిచేస్తూ.. మూడేళ్లే అని
ఒకే జిల్లాలో మూడేళ్లకు పైగా పనిచేస్తున్న కలెక్టర్లు, జేసీలు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కూడా ఎన్నికల సమయంలో బదిలీ చేస్తుంటారు. వీటిని ఎన్నికల బదిలీలుగా వ్యవహరిస్తారు.
యాదాద్రి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే నల్గొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. అయితే తనకు ఇంకా ఇక్కడ మూడేళ్లు పూర్తికాలేదని తప్పుడు నివేదిక ఇచ్చారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. ఆయన్ను తక్షణం సస్పెండ్ చేయమని ఆదేశించడంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.