ఈటలకు ఇకనుంచి 'వై' కేటగిరీ భద్రత
వై' కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది ఈటలకు సెక్యూరిటీగా ఉంటారు. కాన్వాయ్ లో ఆయన వ్యక్తిగత వాహనం తోపాటు ఒకటి లేదా రెండు వాహనాలు అనుసరిస్తాయి.
తనకు ప్రాణహాని ఉందని, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన హత్యకోసం సుపారీ ఇచ్చారని ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం 'వై' కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈటల ప్రాణహాని ఆరోపణలు చేసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ విషయంపై దృష్టిపెట్టారు, డీజీపీతో మాట్లాడి ఈటలకు భద్రత పెంచాలన్నారు. డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలతో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు, ఈటల ఇంటికి వెళ్లారు. ఆయన్ను కలిసి వివరాలు సేకరించారు. హత్యారోపణలకు సంబంధించిన నిజానిజాలు నిర్థారించుకున్నారు. ఆయనకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ డీజీపీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఈటలకు 'వై' కేటగిరీ భద్ర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
'వై'కేటగిరీ అంటే..
ప్రస్తుతం ఈటలకు ఎమ్మెల్యేకు ఉండే సాధారణ భద్రత ఉంది. ఇకపై ఆయనకు 'వై' కేటగిరీ కింద ప్రత్యేకంగా భద్రత పెంచుతారు. 'వై' కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది ఈటలకు సెక్యూరిటీగా ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు కమాండోలు ఆయనకు సెక్యూరిటీగా వెంట నడుస్తారు. కాన్వాయ్ లో ఆయన వ్యక్తిగత వాహనం తోపాటు ఒకటి లేదా రెండు వాహనాలు అనుసరిస్తాయి. మొత్తంగా నెలకు 12 లక్షల రూపాయలు 'వై' కేటగిరీ వ్యక్తుల భద్రత కోసం ఖర్చు చేస్తారు.
బీజేపీ మౌనం..
ఈటల రాజేందర్ తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించినా.. ఆ పార్టీ నేతలెవరూ స్పందించక పోవడం విశేషం. ఈటల భార్య, ఆ తర్వాత ఈటల.. ఈ ఆరోపణలు చేశారు. ఈటల భార్య ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలెవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడలేదు, కనీసం పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆయన ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది. మంత్రి కేటీఆర్ చొరవతో ఈటలకు 'వై' కేటగిరీ భద్రత దక్కింది.