Telugu Global
Telangana

మునుగోడుతో రాంగ్ స్టెప్.. బీజేపీలో అంతర్మథనం..

భిక్షమయ్య గౌడ్, శ్రవణ్, స్వామి గౌడ్.. పేరున్న నాయకులతోపాటు, చిన్నా చితకా క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తోంది. పైగా బీజేపీ చేసిన పని వల్ల కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.

మునుగోడుతో రాంగ్ స్టెప్.. బీజేపీలో అంతర్మథనం..
X

మునుగోడు ఉప ఎన్నికే లేకుంటే మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీ నుంచి బయటకు వచ్చేవారా..?

మునుగోడు ఉప ఎన్నిక లేకపోతే దాసోజు శ్రవణ్ పార్టీ మారేవారా.. ? ఉద్యమ నాయకుడు స్వామిగౌడ్ కమలానికి గుడ్ బై చెప్పేవారా..?

మునుగోడు ఉప ఎన్నికే లేకుండా 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కుంభకోణం బయటకు వచ్చేదా.. ?

ఉప ఎన్నిక వల్ల బీజేపీకి లాభం లేకపోగా నష్టం ఎక్కువగా జరుగుతోంది. అందుకే అధినాయకత్వంలో మథనం మొదలైంది.

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాంగ్ స్టెప్ వేసిందని అర్థమైపోయింది. ఇప్పటికే జరగరాని నష్టం జరిగింది. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం మునుగోడులో అనవసరంగా ఉప ఎన్నిక తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. పైగా మునుగోడుకి గతంలో కేంద్రం ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదనే విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది. నేతన్నలపై కేంద్రం జీఎస్టీ భారం మోపిందనే ఆగ్రహం మరింత ఎక్కువైంది.

ఇవన్నీ ఒకెత్తు అయితే నేతల వలసలు మరో ఎత్తు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికే లేకపోతే బీజేపీ నుంచి బయటకు వెళ్లేవారు కాస్త ఆలోచించేవారేమో. కానీ ఇప్పుడు సింప్టమ్స్ బాగోలేకపోవడంతో బీజేపీలో నేతలు ఇమడలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై వస్తున్న వ్యతిరేకత ఓవైపు, ప్రత్యేకంగా తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న వాదన మరోవైపు.. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉండటం ఏమాత్రం క్షేమకరం కాదని, భవిష్యత్తుకు తీరని నష్టం కలుగుతుందని నేతల అంచనా. అందుకే ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. కేసీఆర్ కి జై కొడుతున్నారు.

భిక్షమయ్య గౌడ్, శ్రవణ్, స్వామి గౌడ్.. పేరున్న నాయకులతోపాటు, చిన్నా చితకా క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తోంది. పైగా బీజేపీ చేసిన పని వల్ల కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అసలు మునుగోడు ఉప ఎన్నికలే లేకపోతే ఇదంతా జరిగేది కాదని బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. తీరా ఇప్పుడక్కడ బీజేపీ సాధించేదేమీ లేదు. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యేనని తేలిపోయింది. ఈ దశలో మూడో స్థానానికి పడిపోయి, డిపాజిట్లు కూడా గల్లంతయితే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా పడుతుందని, ఆ తర్వాత 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీకి తెలంగాణలో ఘోర పరాభవం తప్పదని అంచనా వేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఏముంటుంది. అందుకే బీజేపీ అధిష్టానం సైలెంట్ గా ఉంది.

First Published:  22 Oct 2022 7:59 AM IST
Next Story