Telugu Global
Telangana

పురుగుల అన్నం... ప్రిన్సిపాల్ సస్పెన్షన్

తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు దాదాపు 70 మంది ఉదయం ఐదు గంటల‌కు వణికించే చలిలో 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి వచ్చి ధర్నాకు దిగారు.

పురుగుల అన్నం... ప్రిన్సిపాల్ సస్పెన్షన్
X

తమకు పెట్టే అన్నంలో పురుగులు, వానపాములు వస్తున్నాయని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్​ స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. పురుగుల అన్నంపై ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్, హాస్టల్​వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాచ్ మెన్ రామస్వామి తాగిన మత్తులో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా.. ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక వార్డెన్ రమ్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు దాదాపు 70 మంది ఉదయం ఐదు గంటల‌కు వణికించే చలిలో 2 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి వచ్చి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘అన్నంలో పురుగులు, వానపాములు వస్తున్నాయి. ఆ తిండి తినలేకపోతున్నాము. అనారోగ్యాలపాలవుతున్నాం. దీనిపై ప్రశ్నిస్తే హాస్టల్ వార్డెన్ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి ప్రతిరోజూ మమ్మల్ని వేధిస్తున్నారు. హాస్టల్ లో మిగిలిన కూరగాయలు, ఇతర సామగ్రిని ప్రతిజూ ప్రిన్సిపాల్ ​తన ఇంటికి తీసుకెళ్తున్నారు. న్యూఇయర్ కల్చరల్ ఫెస్టివల్ కు కాస్ట్యూమ్స్ ​కోసం ప్రభుత్వం రూ.60 వేలు ఇస్తే, ప్రిన్సిపాల్ ​మేడమ్ ​రూ.20 వేలు మాత్రమే ఖర్చుపెట్టారు.కల్చరల్ ఫెస్ట్​ సందర్భంగా 50 చపాతీలు, 3 కిలోల మటన్​ ఇంటికి తీసుకెళ్లారు. అటెండర్ రామస్వామి ప్రతి రోజూ రాత్రి తాగొచ్చి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మమ్మల్ని కొడుతున్నాడు. మమ్మల్ని వేధిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్,అటెండర్ లను వెంటనే విధులనుంచి తొలగించాలి. ” అని డిమాండ్ చేశారు.

కాగా ధర్నా చేసి తిరిగి పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులను ప్రిన్సిపాల్ లోపలికి రానివ్వలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన బీఆరెస్ నాయకులతో విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ నాయకులు జోక్యం చేసుకోవడంతో విద్యార్థులను పాఠశాలలోనికి అనుమతించారు.

తమ పిల్లలు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల దగ్గరికి చేరుకొని నిరసనకు దిగారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న అక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని సస్పెండ్ ​చేస్తున్నట్లు, అటెండర్ రామాస్వామిని డ్యూటీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ప్రస్తుతానికి సమస్య పరిష్కారమయ్యింది.

First Published:  9 Jan 2023 9:00 AM IST
Next Story