బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమమించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రతినిధుల సభను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమమించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
'భారత దేశం 75 ఏళ్ల పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నాము. అయినా నేటికీ దేశ ప్రజలు తాగు, సాగు నీరు, విద్యుత్ అందక అల్లాడిపోతున్నారు. మౌలిక వసతుల కొరతతో దేశ ప్రగతి మందగిస్తోంది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలవాల్సిన యువతకు.. ఉద్యోగ అవకాశఆలు లేకపోవడంతో నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్షలు కొనసాగుతున్నాయి. ఈ వివక్షల వల్ల భారత సమాజం ఆశించిన స్థాయిలో వికసించడం లేదు' అని కేటీఆర్ తీర్మానంలో పేర్కొన్నారు.
దేశంలో సామాజిక సమానత్వం కొరవడిందని.. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక మగ్గిపోతున్నారని తీర్మానంలో వివరించారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ హక్కులు, రక్షణ కల్పించినప్పటికీ.. ఇప్పటికీ దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులు నాగరికతా విలువలను పరిహసిస్తున్నయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు.
దేశంలో ఎన్నో అద్భుతమైన వనరులు ఉన్నాయి. పాలకుల వైఫల్యంతో ప్రజలు దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిన స్థాయిలో ఉన్నది. ఏటా దాదాపు 4వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తున్నది. 70 వేల టీఎంసీల నీరు నదుల్లో ప్రవహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికి 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకున్నాము. మిగిలిన 50 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయి.
సముద్రంలో కలిసే నీటి నుంచి మరో 20వేల టీఎంసీల నీరు వినియోగించుకుంటే.. దేశంలో సాగుయోగ్యమైన 41 కోట్ల ఎకరాల్లో ప్రతీ ఎకరానికి సాగునీటిని అందించవచ్చని కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంలో తెలిపారు. దేశంలో 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే.. దేశ పాలకులు తమాషా చూస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా తాగు, సాగు నీటికి కటకటగానే ఉంది. భారత్ కన్నా చిన్న విస్తీర్ణంలో చిన్న దేశాలు పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉన్నది.
దేశ పాలకులు ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ మినహా.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీరు లేక బాధలు పడుతున్నారు. దేశంలోని అనేక పట్టణాలు, నగరాల్లో వారానికి ఒక సారి మాత్రమే తాగు నీరు వస్తోంది. పల్లెల్లో మహిళలు మైళ్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కడివెడు నీళ్ల కోసం వీధి పోరాటాలకు దిగాల్సి వస్తోందని కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS గారు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
— BRS Party (@BRSparty) April 27, 2023
భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ - తీర్మానాలు : https://t.co/L212WQjLAb pic.twitter.com/PWh8HRZqyf