దైవంగా భావిస్తే.. ప్రాణమే తీసింది
దైవంగా భావించి ఓ నాగు పాముకు కొన్ని సంవత్సరాలుగా పూజలు చేసిన వృద్ధురాలిని చివరికి ఆ పామే కాటేసి ప్రాణం తీసింది. నిర్మల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
దైవంగా భావించి ఓ నాగు పాముకు కొన్ని సంవత్సరాలుగా పూజలు చేసిన వృద్ధురాలిని చివరికి ఆ పామే కాటేసి ప్రాణం తీసింది. నిర్మల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ (65) అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసి జూలై ఒకటో తేదీనే రిటైరైంది. ఆమెకు కుమారుడు రాజలింగు, కుమార్తె పద్మ ఉండగా, వారికి వివాహాలయ్యాయి.
నాగమ్మ ఇంట్లో ఓ పాము పుట్ట ఉంది. అందులో నాగుపాము ఉన్నట్టు ఆమె గుర్తించింది. అయితే ఆమె ఆ పామును దైవంగా భావించింది. కొన్ని సంవత్సరాలుగా పూజలు కూడా చేసింది. రిటైర్మెంట్ తర్వాత ఇంటి వద్దే ఉంటున్న గంగవ్వ మంగళవారం ఉదయం ఇల్లు అలికేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇంట్లోని మట్టి నేలను అలుకుతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి వచ్చిన పాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది.
పాము కాటుతో భయాందోళనలకు గురైన ఆమె వెంటనే బయటికి వచ్చి స్థానికులకు చెప్పింది దీంతో వారు హుటాహుటిన ఆమెను నాటు వైద్యం కోసం లింగాపూర్‌కి తీసుకెళ్లారు. అయితే ఆమె పరిస్థితి విషమించిందంటూ వైద్యం చేయడానికి నాటు వైద్యుడు నిరాకరించాడు. దీంతో ఆమెను అక్కడినుంచి ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గంగవ్వ కుమార్తె పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.