నడుస్తున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం – డ్రైవరే నిందితుడు
నడుస్తున్న బస్సులో 26 ఏళ్ల ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది.
నడుస్తున్న బస్సులో 26 ఏళ్ల ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మంగళవారం ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అది ప్రైవేటు స్లీపర్ బస్సు అని, తెలంగాణలోని నిర్మల్ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు వెళుతోందని వారు తెలిపారు.
ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని పోలీసులు చెప్పారు. బస్సు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ శివార్లలో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు. బాధిత మహిళ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. దీంతో వెంటనే పోలీసు సిబ్బంది బస్సును అడ్డుకున్నారు. ఈ క్రమంలో మెట్టుగూడ ప్రాంతంలో వాహనం వేగం తగ్గడంతో మహిళపై ఘాతుకానికి పాల్పడిన డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు.
బస్సులోని ఇద్దరు డ్రైవర్లలో ఒకరు బస్సులో ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ తన నోటిలో దుప్పటి కుక్కి కదులుతున్న బస్సులోనే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. బస్సును నడుపుతున్న డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మహిళను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టామని వివరించారు.