Telugu Global
Telangana

ప్రేమించిన‌వాడే.. న‌ర‌కం చూప‌డాన్ని తాళ‌లేక‌.. - ముగ్గురు బిడ్డ‌ల‌తో వివాహిత ఆత్మ‌హ‌త్య‌

వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అలీ రజితను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అత‌ని వేధింపులు తాళ‌లేక ఆమె వేములవాడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

ప్రేమించిన‌వాడే.. న‌ర‌కం చూప‌డాన్ని తాళ‌లేక‌.. - ముగ్గురు బిడ్డ‌ల‌తో వివాహిత ఆత్మ‌హ‌త్య‌
X

మ‌తాలు వేరైనా.. పెద్ద‌లు కాద‌న్నా.. ప్రేమించిన వ్య‌క్తి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న‌వాడే వ‌ర‌క‌ట్న పిశాచి ప‌ట్టి.. న‌ర‌కం చూపుతుంటే తాళ‌లేక‌.. ఓ వివాహిత త‌న ముగ్గురు బిడ్డ‌లు స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన రజిత అలియాస్ నేష (30) కంప్యూటర్ నేర్చుకునేందుకు కరీంనగర్ వెళ్లేది. అక్క‌డ అర‌టి పండ్లు విక్ర‌యించే సుభాష్‌న‌గ‌ర్‌కు చెందిన మ‌హ్మ‌ద్ అలీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. వారి వివాహానికి రెండు కుటుంబాలూ అంగీకరించలేదు. అయినా ప‌దేళ్ల క్రిత‌మే ఇంట్లో నుంచి వెళ్లిపోయి అలీని పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు మహ్మద్ అయార్ష్ (7), ఉస్మాన్ మహ్మద్ (14 నెలలు), ఒక కుమార్తె అశ్రజబిన్ (5) ఉన్నారు.

వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచే అలీ రజితను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అత‌ని వేధింపులు తాళ‌లేక ఆమె వేములవాడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. తన ప్రవర్తన మార్చుకుంటానని మాట ఇచ్చిన‌ అలీ అప్పుడు లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత రజిత కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఈ నెల 27న భార్య, ముగ్గురు పిల్లలను రుద్రవరంలోని ఆమె పుట్టింట్లో దింపాడు. తల్లిదండ్రులు రాజనర్సు, లక్ష్మి.. రజితకు సర్దిచెప్పి భర్త దగ్గరకు వెళ్లాలని మరుసటిరోజు బస్ స్టాప్ వద్ద దింపారు.

అక్క‌డినుంచి త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెను భ‌ర్త వేధిస్తున్నాడ‌ని వేముల‌వాడ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. బక్రీద్ తర్వాత పిలిపిస్తామని పోలీసులు చెప్పడంతో వారు రుద్రవరం వచ్చారు. ఇంత‌లోనే దారుణం చోటుచేసుకుంది. మానేరు జ‌లాశ‌యంలో ర‌జిత‌, ఆమె ముగ్గురు పిల్ల‌లు శ‌వాలై క‌నిపించారు. క‌ట్నం కోసం వేధించ‌డం వ‌ల్లే త‌న అక్క ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని.. ర‌జిత త‌మ్ముడు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఎస్ఐ మ‌హేంద‌ర్ వెల్ల‌డించారు.

First Published:  1 July 2023 7:43 AM IST
Next Story