Telugu Global
Telangana

జనం సొమ్ముతో.... ట్విట్టర్ లో ట్రెండింగ్ కోసం టెండర్లు ఆహ్వానించిన కేంద్రప్రభుత్వం

సెప్టంబర్ 17 న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేయాలని నిర్ణయించిన‌ మోడీ సర్కార్ అందుకోసం జనం సొమ్ముతో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. చివరకు తమ కార్యక్రమాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేయడం కోసం కూడా టెండర్లను ఆహ్వానించింది.

జనం సొమ్ముతో.... ట్విట్టర్ లో ట్రెండింగ్ కోసం టెండర్లు ఆహ్వానించిన కేంద్రప్రభుత్వం
X

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అందుకు కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకోవడానికి రెడీ అయ్యింది. సెప్టంబర్ 17వ తేదీని వివాదాస్పదం చేసి, విద్వేషాలు రెచ్చ గొట్టి దాని ద్వారా ఓట్ల పోలరైజేషన్ చేయాలన్న ప్రణాళికలో భాగంగా ఏకంగా మోడీ సర్కారే రంగంలోకి దిగింది. ఎన్నడూ లేని విధంగా సెప్టంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించడానికి సిద్దపడింది. దాని కోసం 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ఆ ప్రచార కార్యక్రమం కోసం ప్రవేటు సంస్థలనుంచి, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్న‌ కేంద్ర సాంస్కృతిక శాఖ బిడ్లను ఆహ్వానించింది.

కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్లలో ప్రమోషన్ చేయవల్సిన అంశాలు...

1. క్రియేటివ్ & రేడియో జింగిల్స్ తయారీ - కంటెంట్ ప్రమోషన్‌ల కోసం

2. అవుట్‌డోర్ ప్రమోషన్‌లు

3. ప్రాంతీయ‌ టీవీ/న్యూస్/లోకల్ కేబుల్ ద్వారా ప్రమోషన్‌లు

4. FM రేడియోలో ప్రమోషన్‌లు

5. ప్రాంతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా ప్రమోషన్‌లు

6. Facebook ద్వారా ప్రమోషన్‌లు ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసారం, YouTube ప్రత్యక్ష ప్రసారం

7. ఈవెంట్ కు డ్రోన్ కవరేజ్

8. ఈవెంట్ ను వీడియో, ఫోటోలు తీయడం

9. నగరంలో ఆటో రిక్షాలపై బ్యానర్‌ల ద్వారా ప్రచారాలు

10. మెట్రో పిల్లర్ల పై ప్రమోషన్‌లు

11. బస్ షెల్టర్లలో ప్రమోషన్‌లు

12. ప్రముఖ ప్రదేశాలలో ప్రకటనలతో కూడిన వ్యాన్లు

13. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రమోషన్‌లు

14. Facebook, Instagram, Twitter, YouTubeలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రమోషన్ లు

15. మొత్తం నగరంలో క్లాత్ బ్యానర్‌ల ద్వారా ప్రమోషన్‌లు

16 నగరంలోని వివిధ ప్రదేశాలలో హోర్డింగ్లు, కటౌట్లు.

17. నగరంలో వివిధ ప్రదేశాలలో సర్దార్ పటేల్ హోర్డింగ్‌లు

18. 17 సెప్టెంబర్ 2022న ఉదయం 08.30 నుండి ట్విట్టర్ ట్రెండింగ్




అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రమోషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం జనం సొమ్మును బాగానే ఖర్చు పెడుతుంది కానీ ట్విట్టర్ ట్రెండింగ్ కోసం కూడా సొమ్ము ఖర్చు పెట్టడం, అందులోనూ ప్రభుత్వమే ఆ పని చేయడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటుందా ? ఇప్పటి దాకా బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న పనిని ఇకపై మోడీ సర్కారే నెత్తికెత్తుకుందా ? మన పన్నుల తో నడిచే ప్రభుత్వం బీజేపీ ప్రచారాన్ని తలకెత్తుకోవడం, అందులోనూ ట్విట్టర్ ట్రెండింగ్ కూడా బిడ్డర్ లో ప్రస్తావించడం తమను ఎవరూ ప్రశ్నించరనే అహంభావమా లేక‌ ప్రశ్నించినా వాళ్ళ నోరు మూయించడానికి, ఈడీలు, సీబీఐలు, ఎన్ ఐ ఏ లున్నాయనే ధీమానా ?

కేంద్ర ప్రభుత్వ చేస్తున్న ఈ చర్య ఏ రాజ్యాంగ నిబంధనల కిందికి వస్తుందని సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పన్నులతో పార్టీ ప్రచారం చేసుకోవడం, అందులోనూ ట్విట్టర్ ట్రెండింగ్ పేరిట సొమ్ము ఖర్చుపెట్టడాన్ని నెటిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ రోజుల్లో భారత ప్రభుత్వం ట్విట్టర్ ట్రెండ్‌లను కూడా అధికారికంగా టెండర్ చేస్తుందా? అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా

వాట్సాప్ లో ఫార్వార్డ్ చేయడానికి, ట్విట్టర్ లో ట్రెండ్ చేయడానికి డబ్బు ఖర్చుపెడతారు కానీ తెలంగాణకు మాత్రం ఒక్క రుపాయి కూడా ఇవ్వరు. అంతే కదా కిషన్ రెడ్డీ.... అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

First Published:  9 Sept 2022 3:04 PM IST
Next Story