విష్ణుకు కేసీఆర్ అండ.. ఇకనైనా మాస్ లీడర్‌గా ఎదుగుతాడా?
కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విష్ణుకు బీఆర్‌ఎస్‌లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అండ దొరికింది.
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరిగా ఉండి మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పి.జనార్దన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి తన తండ్రిలా మాస్ లీడర్‌గా మాత్రం ఎదగలేకపోయారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి 2009లో ఆకస్మిక మరణించగా .. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి అఖండ విజయం సాధించారు. ఏకంగా 2,80,236 ఓట్ల మెజారిటీతో రికార్డ్ స్థాయిలో విజయం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఇదే అత్యధిక మెజారిటీ.
ఈ ఎన్నిక తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన తండ్రిలాగే గొప్ప నాయకుడిగా ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018లో కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. రెండు వరుస ఓటములతో ఢీలాపడ్డ విష్ణు రాజకీయంగా అనుకున్నంత ముందుకు వెళ్లలేకపోయారు.
కార్మికులు, పేదల పక్షాన పోరాడి కార్మిక నాయకుడిగా జనార్దన్ రెడ్డి పేరు తెచ్చుకోగా.. విష్ణు మాత్రం ఈ గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరపున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని విష్ణు భావించగా.. కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. విష్ణు పార్టీలో చేరిన సమయంలో తన మిత్రుడు జనార్దన్ రెడ్డి కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు బాధ్యత ఇకపై తనదేనని కేసీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విష్ణుకు బీఆర్‌ఎస్‌లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అండ దొరికింది. ఈ ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డికి గోషామహల్ టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ అండతోనైనా విష్ణువర్ధన్ రెడ్డి మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకుంటారో.. లేదో చూడాల్సి ఉంది.
♦