Telugu Global
Telangana

విజయశాంతి పార్టీ మారతారా! ఆమె అలక వెనుక కారణం అదేనా?

తాజాగా పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీ నాయకత్వంపై అలకబూనారు.

విజయశాంతి పార్టీ మారతారా! ఆమె అలక వెనుక కారణం అదేనా?
X

తెలంగాణ బీజేపీ ఇప్పుడు అంతర్గత విభేదాలతో సతమతం అవుతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని ప్రచారం చేసుకున్న బీజేపీ పరిస్థితి.. ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం మాట అటుంచితే.. పార్టీలోని కీలక నాయకుల అసంతృప్తిని చల్లార్చడానికే సమయం సరిపోవడం లేదు. నిన్న మొన్నటి వరకు పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి నాయకులు రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. కొత్తగా వచ్చిన నాయకులన సంతృప్తి పరచడానికే బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి మార్పు తర్వాత కొంత మంది నాయకులు అసంతృప్తి రాగం వినిపంచడం బంద్ చేశారు.

తాజాగా పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి బీజేపీ నాయకత్వంపై అలకబూనారు. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనడంపై ఆమె బహిరంగంగానే అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్న వ్యక్తితో కలిసి స్టేజ్ పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని విజయశాంతి మీడియాకు చెప్పారు. కిరణ్ రెడ్డి రావడంపై నిరసన వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వెంటనే వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె బయట ఎవరికీ కనపడలేదు. కొంత మంది సీనియర్ నాయకులు సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె టచ్‌లోకి రాలేదని తెలుస్తున్నది.

పైకి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నా.. విజయశాంతి ఆలోచనలు మరోలా ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. కొంత కాలంగా బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయశాంతి బాధపడుతున్నారు. పాత నాయకులు పార్టీలో పాతుకొని పోగా.. కొత్తగా వచ్చిన నాయకులకు కూడా అధిష్టానం ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తనను పూర్తిగా పక్కన పెట్టారని విజయశాంతి భావిస్తున్నారు. కేవలం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోలేదని.. తన అసంతృప్తిని బయటపెట్టడానికి సమయం కోసం వేచి చూసి.. ఆ రోజు మీడియా ముందు వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.

విజయశాంతి గతంలో కూడా రాజా సింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. అందుకే ఆమె బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత నాంపల్లి ఆఫీసుకు వచ్చిన విజయశాంతి.. కాసేపు కూడా అక్కడ ఉండకుండానే మీడియా ముందు తన అసంతృప్తిని వెల్లడించారు.

సీనియర్ కాంగ్రెస్ నేతలతో విజయశాంతి ఇప్పటికే టచ్‌లో ఉన్నారని తెలుస్తున్నది. అధిష్టానం వద్దకు ఇప్పటికే రాయబారం పంపారని.. విజయశాంతి చేరికపై వారే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని సమాచారం. దీనిలో భాగంగానే బీజేపీపై తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నట్లు తెలుస్తున్నది. విజయశాంతి అలక వెనుక పార్టీ మార్పు ఉన్నదని కూడా ప్రచారం జరుగుతోంది.

First Published:  23 July 2023 1:42 PM IST
Next Story