Telugu Global
Telangana

తుమ్మలకు మిగిలింది ఒకటే దారా?

గ్రౌండ్ లెవల్లో సమాచారం ప్రకారం కాంగ్రెస్‌లో చేరేందుకే తుమ్మల మొగ్గు చూపుతారని అనిపిస్తోంది. మరి మద్దతుదారులు ఏమంటారు? తుమ్మల ఆలోచన ఎలా ఉంటుందనేది సమావేశంలో బయటపడుతుంది.

తుమ్మలకు మిగిలింది ఒకటే దారా?
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్‌ పెద్ద షాకే ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో తనకే టికెట్ ఇస్తారని తుమ్మల బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళం ఉపేందర్ రెడ్డికే టికెట్ ప్రకటించారు. కందాళంకే టికెట్ అని ముందే సంకేతాలు ఇచ్చినా కేసీఆర్‌ ఆలోచన మారకపోతుందా అని చివరి వరకు తుమ్మల వెయిట్ చేసి చూశారు. అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించేయటంతో బీఆర్ఎస్‌లో తుమ్మలకు తలుపులు మూసుకుపోయినట్లే అనుకోవాలి.

ఈ నేపథ్యంలో తుమ్మలకు మిగిలింది ఒకటే దారి. అదేమిటంటే ఇండిపెండెంటుగా పోటీ చేయటం లేకపోతే కాంగ్రెస్‌లో చేరటం. బీఆర్ఎస్‌లో తుమ్మలకు టికెట్ దక్కదని అర్థ‌మైపోయిన కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరమని గట్టిగా అడిగారు. కాంగ్రెస్‌లో చేరితే పాలేరులో టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే తుమ్మల మనసంతా బీఆర్ఎస్‌లోనే ఉండటంతో హస్తం పార్టీ నేతలకు ఏమీ చెప్పలేదు. కొంతకాలంగా మద్దతుదారులేమో ఇండిపెండెంటుగా పోటీ చేయాలని తుమ్మలపై బాగా ఒత్తిడి తెస్తున్నారు.

అయితే ఇండిపెండెంటుగా పోటీ చేయటంపై తుమ్మలకు పెద్దగా ఆసక్తిలేదు. అందుకనే ఏం చేయాలో అర్థంకాక ఇంతకాలం ఓపికగా వెయిట్ చేశారు. ఫైనల్‌గా పార్టీలో తలుపులు మూసుకుపోయిన తర్వాత ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంతో పాటు బీఆర్ఎస్‌లోని తన మద్దతుదారులందరితో తుమ్మల సమావేశం పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఒకటి రెండు రోజుల్లో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇండిపెండెంటుగా పోటీ చేయటం ఇష్టం లేకపోతే కాంగ్రెస్‌లో అయినా చేరాలని మద్దతుదారులు ఎప్పటి నుండో చెబుతున్నారు.


ఇంతకాలం ఏవేవో ఆలోచనలతో కాలం నెట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా అలాగే చేస్తే నష్టపోయేది తానే అని తుమ్మలకు అర్థ‌మైనట్లుంది. అందుకనే మద్దతుదారులతో సమావేశం పెట్టారు. గ్రౌండ్ లెవల్లో సమాచారం ప్రకారం కాంగ్రెస్‌లో చేరేందుకే తుమ్మల మొగ్గు చూపుతారని అనిపిస్తోంది. మరి మద్దతుదారులు ఏమంటారు? తుమ్మల ఆలోచన ఎలా ఉంటుందనేది సమావేశంలో బయటపడుతుంది. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

First Published:  22 Aug 2023 11:15 AM IST
Next Story