`మైత్రీ` వ్యవహారంలో ఆ హీరోలను విచారణకు పిలుస్తారా?
ఓ బాలీవుడ్ దర్శకుడికి మైత్రీ సంస్థ హవాలా ద్వారా రూ.150 కోట్లు చెల్లించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తున్న సీక్వెల్ మూవీ హీరోకి కూడా హవాలా రూపంలో చెల్లింపులు చేసినట్టు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ వ్యవహారంలో పలువురు హీరోలను కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే చెల్లింపులు జరిగిన ఇద్దరు బడా హీరోల ఖాతాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. హీరోల రెమ్యునరేషన్ కూడా ఈ సంస్థ హవాలా పద్ధతిలోనే చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయా హీరోలను విచారణకు పిలిచే అవకాశముందని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్‌లో సోదాలు, తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు తాజాగా కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. మైత్రీ సంస్థలోకి రూ.700 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు గుర్తించింది. అవి తొలుత ముంబై కేంద్రంగా ఉన్న కంపెనీకి బదిలీ అయినట్టు నిర్ధారించింది. అనంతరం ఆ డబ్బును ఏడు కంపెనీలకు తరలించినట్టు గుర్తించింది. వాటినుంచి మైత్రీ మూవీ మేకర్స్‌కి పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.
ఓ బాలీవుడ్ దర్శకుడికి మైత్రీ సంస్థ హవాలా ద్వారా రూ.150 కోట్లు చెల్లించినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ సంస్థ తీస్తున్న సీక్వెల్ మూవీ హీరోకి కూడా హవాలా రూపంలో చెల్లింపులు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగేకొద్దీ.. రాను రానూ ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి.