Telugu Global
Telangana

TSPSC పేపర్ లీక్ వ్యవహారం బీజేపీకి ఓట్లు రాలుస్తుందా ?

మరో వైపు కాంగ్రెస్ , బీజేపీలు TSPSC పేపర్ లీక్ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఈ ఓట్ల వేట ప్రయత్నంలో కాస్త ముందుంది.

TSPSC పేపర్ లీక్ వ్యవహారం బీజేపీకి ఓట్లు రాలుస్తుందా ?
X

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్ష పేపర్ల లీక్ ఎంత కాదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి క్ంత మేర ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నది వాస్తవం. TSPSC లో లొసుగులను సరిదిద్దడం, ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉన్న దోషులను శిక్షించడం ద్వారా యువతలో మళ్ళీ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ , బీజేపీలు TSPSC పేపర్ లీక్ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ఈ ఓట్ల వేట ప్రయత్నంలో కాస్త ముందుంది.

యువతను బీజేపీకి దూరం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోందని, యువత చదువులు, ఉద్యోగాలు మానేసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించిన కొద్ది రోజులకే TSPSC పేపర్ లీక్ వ్యవహారం బైటపడింది. లీకేజ్ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త హస్తం కూడా ఉందని బీఆరెస్ చెప్తున్న నేపథ్యంలో ఈమొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. యువతను తమవైపు తిప్పుకొని రాజకీయంగా గరిష్ఠ మైలేజీని రాబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

బిజెపి, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనను నిర్వహించాలని, TSPSC నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగ ఆశావాదులను ఆ ఆందోళనల్లో చేర్చుకోవాలని యోచిస్తోంది. రాష్ట్ర రాజధానిలో నిరుద్యోగ యువతతో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా నిర్వహించిన 'మిలియన్ మార్చ్' తరహాలో సంజయ్ ఒక ఉద్యమాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారని, సంజయ్ మార్చి 25 ఇందిరా పార్క్ వద్ద 'నిరుద్యోగ మహా ధర్నా' అనే పేరుతో ఆందోళన ప్రారంభమవుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే వ్యూహాలపై చర్చించేందుకు సంజయ్ బుధవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. టిఎస్‌పిఎస్‌సి సమస్యను తమకు అనుకూలంగా మలచుకోవాలని, ఈ సమస్య వెనుక ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల హస్తం ఉందన్న అభిప్రాయం కలిగించాలని ఆయన పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఆందోళనల్లో నిరుద్యోగ యువతను భాగస్వాములను చేసి పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

నిరుద్యోగ యువత మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఎన్నికల సమయంలో TSPSC పేపర్ లీక్ ను ఒక ఇష్యూ గా చేయాలని యోచిస్తోంది.

మరి రాబోయే ఎన్నికల్లో ఈ పేపర్ లీకేజీ సమస్య బీజేపీకి ఓట్లు రాలుస్తుందా? ఆ ఓట్లతో వాళ్ళు అధికారంహస్తగతం చేసుకుంటారా ? అనేది వేచి చూడాలి.

First Published:  23 March 2023 9:10 AM IST
Next Story