కాంగ్రెస్ ఆశలన్నీ కర్ణాటక మోడల్ పైనే.. ఇక్కడ వర్కవుట్ అయ్యేనా..?
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించగా.. తెలంగాణలో సోనియా గాంధీ స్వయంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఇక కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలను తెలంగాణలో దశలవారీగా అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మోడల్‌నే నమ్ముకుంది. సంక్షేమ పథకాల విషయంలోనైనా.. ఎన్నికల వ్యూహమైనా కర్ణాటకలో అనుసరించిన పద్ధతులనే ఇక్కడ అమలు చేయాలని భావిస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్‌కు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాయి. దీంతో ఇక్కడ కూడా అదే స్ట్రాటజీతో వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మితే మోసం పోవడం ఖాయమంటూ సీఎం కేసీఆర్ స్వయంగా బహిరంగ సభల్లో చెప్తున్నారు. బుధవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలోనూ ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. అందుకు ఉదాహరణగా కర్ణాటకలో కరెంటు కోతల గురించి వివరించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల విషయంలో బీఆర్ఎస్‌లోనూ కొంత ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆశలు పెట్టుకున్న కారు పార్టీకి ఈ అంశం ఇప్పుడు సవాల్‌గా మారింది.
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించగా.. తెలంగాణలో సోనియా గాంధీ స్వయంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఇక కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలను తెలంగాణలో దశలవారీగా అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వే ఆధారంగా పోలింగ్‌కు 45 రోజులు ముందుగా 55 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. బీజేపీ, బీఆర్ఎస్, MIM ఒకటేనని కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ నేతలంతా ఒకే తాటిపై ఉన్నారని చెప్పేందుకు బస్సు యాత్ర కూడా చేపట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. చెప్పామంటే.. చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
అయితే హామీలు ఇవ్వడం, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్ర, పాదయాత్రలు భారత రాజకీయాల్లో కామన్ అని.. అంతిమంగా ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటక మోడల్ కేవలం మీడియా సృష్టి మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.