మునుగోడు ఉపఎన్నిక రద్దవుతుందా..?
ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి భారీగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి తోడు తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని చెబుతున్న వ్యవహారం మరింత వేడిని రగిలించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లడంతో ఎన్నికలను వాయిదా వేయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ని ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పేరు మారుమోగిపోయి సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక కూడా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి వందలాది కోట్ల రూపాయలను ఎర వేసి వారిని ప్రలోభ పెట్ట జూసిందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి నిందితుల రిమాండ్ కోరారు. అయితే స్వాధీనం చేసుకున్నామంటున్న సొమ్మును పోలీసులు చూపించలేకపోవడంతో పాటు వారు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా కోర్టు ఎదుట చూపలేకపోవడంతో న్యాయామూర్తి నిందితులను విడుదల చేయాలని ఆదేశించింది. నిందితులకు సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వ్యవహారమంతా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బిజెపి కుయుక్తులని అధికారపార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే బిజెపి అభ్యర్ధి రాజగోపాలరెడ్డికి వేలాది కోట్ల (18వేల కోట్ల) కాంట్రాక్టు దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఈ ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు ఓటర్లకు భారీగా నగదు, బంగారం ఇతరత్రా ప్రలోభాలను ఎరగా వేస్తున్నాయనే ప్రచారం విపరీతంగా ఉంది. ఇలా పార్టీలు పోటీపడి డబ్బును పంచడం, ఓటర్లను తీవ్రంగా ప్రలోభ పెట్టడం పై ఎన్నికల సంఘం నిశితంగా గమనిస్తోందని అంటున్నారు.
ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎన్నికల సంఘం సంబంధిత ఎన్నికను రద్దు చేసిన సందర్భాలు పెద్దగా లేకపోయినప్పటికీ తమిళనాడు లోని ఆర్కెనగర్ ఉప పెన్నిక రద్దు చేసిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆర్కెనగర్ కు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో శశికళ సమీప బంధువు దినకరన్ పోటీ చేశారు. అధికార అన్నాడిఎంకె, విపక్ష డిఎంకె పార్టీలు సైతం తట్టుకోలేనంత రీతిలో దినకనరన్ అక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టాడనే వార్తలు వెల్లువెత్తాయి. దీంతో మిగిలిన రాజకీయపార్టీలన్నీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆర్కెనగర్ ఉప ఎన్నికను రద్దు చేసింది.
ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో కూడా బిజెపి అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి భారీగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి తోడు తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని చెబుతున్న వ్యవహారం మరింత వేడిని రగిలించింది. ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న బిజెపి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తుందా.. గెలుపు అవకాశాలు సన్నగిల్లడంతో ఎన్నికలను వాయిదా వేయిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.