Telugu Global
Telangana

ఏపీ రాజకీయాన్ని తెలంగాణ డిసైడ్ చేస్తుందా..?

చంద్రబాబు ప్రయత్నాలకు బీజేపీ లొంగితే.. అంటే అధికారంలోకి రావటంకోసం చంద్రబాబు సహకారాన్ని తీసుకుంటే దీని ప్రభావం ఏపీలో కూడా పడటం ఖాయం. ఏపీలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటేనే తెలంగాణాలో సహకారం తీసుకుంటుంది.

ఏపీ రాజకీయాన్ని తెలంగాణ డిసైడ్ చేస్తుందా..?
X

అవును, ఇందులో అనుమానమే అవసరంలేదు. ఎందుకంటే ఏపీకన్నా సుమారు ఏడాదిముందే తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టే. ఏపీలోని వివిధ పార్టీల మధ్య పొత్తులకు తెలంగాణా ఎన్నికల్లోనే స్పష్టత రాబోతోంది. తెలంగాణా ఎన్నికల ఫలితాలే ఏపీ రాజకీయాన్ని శాసించబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఎవరికివాళ్ళుగా పోటీచేస్తే సాధ్యంకాదని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ డిసైడ్ అయిపోయారు.

అందుకనే బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కూడా ఇదే విషయాన్ని కమలనాధులకు పదేపదే చెబుతున్నారు. అయినా బీజేపీ నేతలు చంద్రబాబుతో పొత్తుకు ఏమాత్రం ఇష్టపడటంలేదు. అందుకనే రూటుమార్చిన చంద్రబాబు తెలంగాణాలో కేసీఆర్ ను బూచీగా చూపించి బీజేపీతో పొత్తుకోసం ట్రై చేస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి టీడీపీ సహకారం వల్ల పని సులభమవుతుందని ఖమ్మం బహిరంగ సభ ద్వారా చంద్రబాబు సంకేతాలు పంపారు.

చంద్రబాబు ప్రయత్నాలకు బీజేపీ లొంగితే.. అంటే అధికారంలోకి రావటంకోసం చంద్రబాబు సహకారాన్ని తీసుకుంటే దీని ప్రభావం ఏపీలో కూడా పడటం ఖాయం. ఏపీలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటేనే తెలంగాణాలో సహకారం తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ అనుకుంటోంది కానీ అసలు పార్టీకి అంత సీనుందా అన్నది డౌటే. ఒకవైపు ఏపీలో టీడీపీని సాంతం చంపేసి ఆ ప్లేసులోకి రావాలని బీజేపీ వెయిట్ చేస్తోంది. టీడీపీ ఉన్నంతవరకు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగే అవకాశంలేదని కమలనాధులకు బాగా తెలుసు.

సో, తెలంగాణాలో టీడీపీ సహకారం తీసుకున్నది అంటే ఏపీలో కూడా పొత్తుకు బీజేపీ రెడీ అయినట్లే అనుకోవాలి. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ జనసేన కూడా కలుస్తుంది. పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు తెలంగాణాలో ఎంత యాక్టివ్ గా ఉంటారన్నది కేసీఆర్ మీద ఆధారపడుంది. ఏదేమైనా ఏడాదికి ముందే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏపీ రాజకీయాన్ని తెలంగాణాయే డిసైడ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

First Published:  23 Dec 2022 10:30 AM IST
Next Story