Telugu Global
Telangana

వ‌ర్గాల‌వారీ డిక్ల‌రేష‌న్లు.. కాంగ్రెస్‌కు ఓట్లు తెస్తాయా..?

రిజ‌ర్వేష‌న్ల‌ను ఎస్సీలకు 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతానికి పెంచుతామ‌ని చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామ‌న్నారు.

వ‌ర్గాల‌వారీ డిక్ల‌రేష‌న్లు.. కాంగ్రెస్‌కు ఓట్లు తెస్తాయా..?
X

రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఎలాగైనా జెండా ఎగ‌రేయాల‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న అధికార బీఆర్ఎస్‌ను త‌ట్టుకుని నిల‌బ‌డటం కాంగ్రెస్ పార్టీకి క‌త్తిమీద సామే. దీంతో తాము ఎన్నిక‌ల్లో పోటీ ఇవ్వాలంటే అంత‌కు మించి.. అన్న‌ట్లు వెళ్లాల్సిందేన‌ని కాంగ్రెస్ పెద్ద‌లు త‌ల‌పోస్తున్నారు. అందుకే వ‌ర్గాల‌వారీగా జ‌నానికి తాయిలాలు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయా వ‌ర్గాల వారీగా డిక్ల‌రేష‌న్లు ప్ర‌క‌టిస్తుండ‌టం ఇందులో భాగ‌మే.

ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌తో షురూ

టీకాంగ్రెస్ ఎన్నిక‌ల తొలి స‌న్నాహ‌క స‌ద‌స్సే స‌ద‌స్సే ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌. చేవెళ్ల‌లో జ‌రిగిన ఈ స‌భ‌లో ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌నన్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామ‌ని, అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ స‌భ‌లో ప్ర‌క‌టించారు. రిజ‌ర్వేష‌న్ల‌ను ఎస్సీలకు 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతానికి పెంచుతామ‌ని చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామ‌న్నారు. ఇందిరమ్మ ఇంటి స్కీమ్, స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి రూ. 6 లక్షల ఆర్థిక సహాయం చేస్తామ‌ని వ‌రాలు కురిపించారు.

బీసీ డిక్ల‌రేష‌న్‌పై ముమ్మ‌ర క‌స‌ర‌త్తు

ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌పై ముమ్మర కసరత్తు చేస్తోంది. బీసీ డిక్లరేషన్‌ కమిటీ చైర్మన్‌ పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేత కత్తి వెంకటస్వామి హైద‌రాబాద్‌లో బీసీ సామాజికవేత్తలు, ఉద్యోగులు, కుల సంఘాల నేతలు, మేధావులతో బుధవారం సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇవ‌న్నీ క్రోడీక‌రించి, బీసీల‌కు ఏం చేయ‌బోతున్నామో హామీలిస్తారు.

త్వ‌ర‌లో మైనార్టీ డిక్ల‌రేష‌న్.. ష‌బ్బీర్‌

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లో మైనార్టీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించ‌బోతోంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ వ‌రంగ‌ల్‌లో ప్ర‌క‌టించారు. బీఆర్ఎస్‌, బీజేపీ రెండూ మైనార్టీల‌కు మేలు చేయ‌లేదు.. మైనార్టీల బాగు కోరేది కాంగ్రెస్సేన‌ని ష‌బ్బీర్ అన్నారు. ఈ డిక్ల‌రేష‌న్లు, క‌స‌ర‌త్తులు అన్నీ బాగానే ఉన్నాయి.. ఇలా వ‌ర్గాల‌వారీగా హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ను అన్ని వ‌ర్గాలూ చేర‌దీస్తాయా..? ఓట్లేసి ఆశీర్వ‌దిస్తాయా..? అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

First Published:  14 Sept 2023 6:00 AM IST
Next Story