Telugu Global
Telangana

'ప్రత్యేక జెండా.. ప్రత్యేక గీతం'.. రేవంత్ సెంటిమెంట్ వ్యూహం పనిచేస్తుందా?

జాతీయ జెండాలాగానే తెలంగాణకు ప్రత్యేక జెండా రూపొందిస్తామని, 'జయజయహే తెలంగాణ' పాటను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ప్రత్యేక జెండా.. ప్రత్యేక గీతం.. రేవంత్ సెంటిమెంట్ వ్యూహం పనిచేస్తుందా?
X

తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ప్రచారం చేసుకున్నా.. రెండుసార్లు కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. అంతే కాకుండా తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ పూర్తిగా తన సొంతం చేసుకున్నారు. అధికారంలోకి రావడానికి ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక సెంటిమెంట్ లేదా భావోద్వేగాన్ని ప్రజల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంది. టీఆర్ఎస్ రెండు సార్లు కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను విజయవంతంగా వాడుకున్నది. ఇక కేంద్రంలోని బీజేపీ అయితే 'మతం' అనే సెంటిమెంట్‌ను ఇప్పటికీ తిరుగులేకుండా ఉపయోగిస్తున్నది.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏనాడూ సెంటిమెంట్ల జోలికి వెళ్లలేదు. సార్వత్రిక ఎన్నికలైనా, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా ఇలాంటి భావోద్వేగాలను పెద్దగా ఉపయోగించుకోలేదు. తెలంగాణ ఇచ్చింది తామే అని రెండుసార్లు ప్రచారం చేసుకున్నా.. పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ మళ్లీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా వర్కవుట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా 'ప్రత్యేక జెండా.. ప్రత్యేక గీతం' అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

జాతీయ జెండాలాగానే తెలంగాణకు ప్రత్యేక జెండా రూపొందిస్తామని, 'జయజయహే తెలంగాణ' పాటను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు వారి ప్రత్యేక చిహ్నాలు ఉన్నాయి. కానీ జెండా మాత్రం ఏ రాష్ట్రానికీ లేదు. ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర జెండా అని రేవంత్ అంటున్నారు. అలాగే తెలంగాణ ఏర్పడి ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచిపోయినా.. రాష్ట్ర గీతం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 'మా తెలుగు తల్లికి' పాట రాష్ట్ర గీతంగా ఉన్నది. ఇప్పుడు ఏపీ ఆ పాటనే రాష్ట్ర గీతంగా కంటిన్యూ చేస్తోంది. అయితే 'జయ జయహే తెలంగాణ' పాటను చాలా మంది రాష్ట్ర గీతమనే అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఆ పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించలేదు.

ఇప్పుడు రాష్ట్ర గీతం విషయాన్ని మరోసారి రేవంత్ తెరపైకి తెచ్చారు. అలాగే సబ్బండ వర్ణాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని రేవంత్ అంటున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ను టీఆర్ఎస్ పార్టీని గుర్తుకు తెచ్చేలా 'టీఎస్' అని పెట్టారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని 'టీజీ'గా మారుస్తామని ప్రకటించారు. ఇలా తెలంగాణ విషయంలో కొత్త సెంటిమెంట్‌ను రేవంత్ తెరపైకి తెస్తున్నారు. తెలంగాణవాదుల్లో ఈ ప్రకటన సానుకూలత వ్యక్తం అవుతున్నది. తెలంగాణ సెంటిమెంట్ అంటే అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు దాన్ని రేవంత్ హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్ ఎలాగో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారని.. ఇప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ జాతీయవాదాన్ని ఎత్తుకోవడంతో.. రేవంత్ మాత్రం తెలంగాణ సెంటిమెంట్‌ను పట్టుకున్నారు. ఈ సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచించడానికి కొంత మంది తెలంగాణవాదుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని వస్తానని పదే పదే చెబుతున్న రేవంత్.. ఇలా సెంటిమెంట్‌ను తలకెత్తుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రేవంత్ వ్యూహం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

First Published:  14 Sept 2022 10:11 AM IST
Next Story