Telugu Global
Telangana

రేవంత్‌కు తలనొప్పులు తప్పవా..?

ఉద్యోగ సంఘాల నేతల అంచనాల ప్రకారం 2024 మార్చి తర్వాత అంటే ప్రతి ఏడాది సుమారు తొమ్మిది వేలమంది ఉద్యోగులు రిటైర్ అయిపోతారట.

రేవంత్‌కు తలనొప్పులు తప్పవా..?
X

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొందరలోనే పెద్ద తలనొప్పి మొదలవ్వబోతోంది. త్వ‌ర‌లోనే అతిపెద్ద ఆర్థికభారం మీద పడబోతోంది. మరో నాలుగు నెలల్లో అంటే 2024 మార్చి నెలలో సుమారు 8,914 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. వీళ్ళ రిటైర్మెంట్ సందర్భంగా పీఎఫ్, గ్రాట్యుటీ లాంటి ఫైనిన్షియల్ బెనిఫిట్స్ ను వెంటనే సెటిల్ చేయాల్సుంటుంది. ఎంతలేదన్నా సుమారుగా సుమారు తొమ్మిది వేలమందికి సెటిల్ చేయాలంటే తక్కువలో తక్కువ 3 లేదా 4 వేల కోట్ల రూపాయలు కావాల్సుంటుంది.

ఎందుకంటే.. ఎంత తక్కువేసుకున్నా ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బెనిఫిట్స్ సుమారు రూ. 50 లక్షల వ‌ర‌కు ఉంటుంది. రిటైర్ అయ్యే ఉద్యోగి స్థాయిని బట్టి బెనిఫిట్స్ కాస్త అటు ఇటుగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును 2021లో కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్ళకు పెంచింది. కాబట్టి 58 ఏళ్ళకు రిటైర్ అవ్వాల్సిన ఉద్యోగులకు మూడేళ్ళ సర్వీసు పెరిగి రాబోయే ఏడాది మార్చిలో 61 ఏళ్ళకు రిటైర్ అవబోతున్నారు.

ఉద్యోగ సంఘాల నేతల అంచనాల ప్రకారం 2024 మార్చి తర్వాత అంటే ప్రతి ఏడాది సుమారు తొమ్మిది వేలమంది ఉద్యోగులు రిటైర్ అయిపోతారట. అంటే ప్రతి ఏడాది తక్కువలో తక్కువ ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా రూ. 4వేల కోట్లు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సుంటుంది. 2028 నాటికి సుమారు 45 వేలమంది ఉద్యోగులు రిటైర్ అయిపోతారని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల ఆర్థికభారంతో ప్రభుత్వం అవస్థ‌లు పడుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచితహామీలను అమలుచేయాల్సుంటుంది. ఈ కారణంగా మరికొన్ని వేల కోట్ల రూపాయల అదనపు భారం ఖజానామీద తప్పేట్లులేదు. ఇది సరిపోదన్నట్లుగా సడెన్‌గా రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ భారం కూడా మీదపడుతోంది. ఇవన్నీ కాకుండా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద తలనొప్పులు తప్పేట్లు లేదు. మరి ఇందులో నుంచి ఎలా బయటపడతారో చూడాల్సిందే.

First Published:  19 Dec 2023 10:25 AM IST
Next Story