Telugu Global
Telangana

రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లేనా..?

ఈ పథకాలన్ని అమలు కావాలంటే ఏడాదికి సుమారు రూ.1.4 లక్షల కోట్లు అవసరం. అయితే బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది రూ. 53 వేల కోట్లు మాత్రమే. అంటే అవసరంలో సగం నిధులు కూడా కేటాయించలేదు.

రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లేనా..?
X

పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారంటీస్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సిక్స్ గ్యారంటీస్ అమలుపై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని, కాబట్టి ఇచ్చిన హామీలను అమలుచేసి తీరుతామని అందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అండ్ కో ప‌దేప‌దే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదేమాట చెబుతున్నారు. అయితే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే సిక్స్ గ్యారంటీస్ అమలుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

విషయం ఏమిటంటే.. సిక్స్ గ్యారంటీస్ అంటే మహాలక్ష్మి పథకంలో నెలకు రు. 2500 పెన్షన్, రైతుభరోసా కింద సాయం, గృహజ్యోతి పథకంలో అర్హులకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఐదేళ్ళల్లో 20 లక్షల నిర్మాణం, ఉచితబస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండ‌ర్‌, చేయూత పథకంలో వివిధ రకాల పెన్షన్లు, యువవికాసం పథకంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు ఉన్నాయి. ఈ పథకాలన్ని అమలు కావాలంటే ఏడాదికి సుమారు రూ.1.4 లక్షల కోట్లు అవసరం.

అయితే బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది రూ. 53 వేల కోట్లు మాత్రమే. అంటే అవసరంలో సగం నిధులు కూడా కేటాయించలేదు. బడ్జెట్లో కేటాయించింది కేటాయించినట్లు ప్రభుత్వం శాఖలకు నిధులు విడుదల చేయదన్న విషయం అందరికీ తెలిసిందే. బడ్జెట్లో కేటాయింపులు వేరు, మంజూరు వేరే విధంగా ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో 1.39 కోట్లమంది మహిళలకు నెలకు రూ. 2500 సాయం అందించాలంటే ఏడాదికి రూ. 41,700 కోట్లు అవసరం. అలాగే రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పింది. నెలకు ఒక సిలిండర్ కాకపోయినా ఏడాదికి ఆరు సిలిండర్లను అందించాలన్నా రూ. 2100 కోట్లు అవసరం.

ఇక మహిళల ఉచిత ప్రయాణ పథకంలో ఆర్టీసీకి ఏడాదికి ప్రభుత్వం రూ. 3,600 కోట్లు రీయింబర్స్ చేయాల్సుంటుంది. రైతుభరోసా కింద ఏడాదికి రూ. 22,800 కోట్లు చెల్లించాలి. కౌలురైతులకు ఏడాదికి రూ. 975 కోట్లు చెల్లించాలి. వ్య‌వ‌సాయ కూలీలందరికీ సాయం చేయాలంటే ఏడాదికి రు. 6,240 కోట్లు అవసరం. గృహజ్యోతి పథకంలో నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకంలో ప్రభుత్వం విద్యుత్ సంస్థ‌కు చెల్లించాల్సిన మొత్తం ఏడాదికి రూ. 6315 కోట్లు. ఇందిరమ్మ ఇళ్ళకు ఏడాదికి కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 20 వేల కోట్లు.

దివ్యాంగులతో కలుపుకుని రకరకాల పింఛన్లకు ఏడాదికి చెల్లించాల్సింది రూ. 18,240 కోట్లు. యువవికాసం లెక్కలు పూర్తిగా లేవు. ఈ విధంగా మొత్తం చూసుకుంటే ఏడాదికి రూ. 1.4 లక్షల కోట్లు అవసరమైతే కేటాయించింది కేవలం రు. 53 వేల కోట్లు మాత్రమే. దీంతోనే రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అర్థ‌మవుతోంది.

First Published:  13 Feb 2024 11:53 AM IST
Next Story