Telugu Global
Telangana

మణిపూర్ ఘటనపై మోడీ, అమిత్ షా నోరు విప్పరా? : మంత్రి కేటీఆర్

భయంకరమైన అల్లర్లు చెలరేగుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి మౌనంగా ఉండటంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణిపూర్ ఘటనపై మోడీ, అమిత్ షా నోరు విప్పరా? : మంత్రి కేటీఆర్
X

మణిపూర్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న హింసాత్మక, అమానవీయ సంఘటనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒకప్పుడు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని పిల్లలు, మహిళలపై చేసిన ఆకృత్యాలపై మనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాం. కానీ ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఇద్దరు మహిళలను మైతీ తెగకు చెందిన అల్లరి మూక రోడ్లపై నగ్నంగా ఊరేగించి, వారిపై దారుణంగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ వీడియో చూస్తేనే ఎంతో బాధగా, వికారంగా అనిపించింది. ఇలాంటి సంఘటనలు చూస్తే.. అనాగరికత అనేది ఇప్పటి నయా భారత్‌లో ఎంత సర్వసాధారణం అయిపోయిందో అనే బాధ ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇంతటి భయంకరమైన అల్లర్లు చెలరేగుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి మౌనంగా ఉండటంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా ఎక్కడ ఉన్నారు. మణిపూర్ మంటల్లో కాలిపోతూ.. ఆత్మగౌరవం పూర్తిగా ముక్కలైపోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని విషయాలను పక్కన పెట్టి.. మణిపూర్‌ను కాపాడటంపైనే సమయాన్ని, శక్తిని ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు.

ఏం జరిగింది?

కాగా.. మణిపూర్‌లో పరిస్థితులు రోజు రోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు తెగల మధ్య ప్రారంభమైన అల్లర్లు.. ఇప్పడు మరింత హింసాత్మకంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు అక్కడ చెలరేగుతున్న అల్లర్లు అణిచివేయడానికి ఎంత ప్రయత్నించినా.. రోజూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్లపై ఊరేగించి, ఆ తర్వాత సామూహికంగా అత్యాచారం చేసి వీడియోలు బయటకు వచ్చాయి.

మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోఉన్న కాంగ్‌పోక్సి జిల్లాలో ఈ దారుణమైన సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. మే 4న ఈ హేయమైన సంఘటన జరుగగా.. తాజాగా దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళలపై ఒక గుంపు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆదివాసి గిరిజన నాయకుల ఫోరమ్ ఆరోపించింది. వీడియో ద్వారా విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

కాగా, ఈ ఘటన కాంగ్‌పోక్సీలో జరగలేదని.. రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో జరుగగా.. కాంగ్‌పోక్సీలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సామూహిక అత్యాచార ఘటనపై మణిపూర్ సీఎం బీరేంద్ర సింగ్ విచారణకు ఆదేశించారు. కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ సంఘటనపై స్పందించారు. నేరానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మణిపూర్ హింస విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడకపోవడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో మణిపూర్ సంఘటన కేంద్ర బిందువుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు తప్పకుండా ఈ విషయంపై చర్చను లేవనెత్తే అవకాశం ఉన్నది.

First Published:  20 July 2023 10:13 AM IST
Next Story