Telugu Global
Telangana

గురుకులాలు ఉంచుతరా.. తీసేస్తరా

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ వాటికి అదనమా.. వాటిని తొలగించి ఏర్పాటు చేస్తారా : మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

గురుకులాలు ఉంచుతరా.. తీసేస్తరా
X

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకులాలను ఉంచుతారా.. తీసేస్తారా అనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని మాజీ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న గురుకులాలకు 119 నియోజకవర్గాల్లో కట్టే ఇంటిగ్రేటెడ్‌ రెసిడేన్షియల్‌ స్కూల్స్‌ అదనమా.. లేక వాటిని కుదించి 119 మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారా చెప్పాలని ప్రశ్నించారు. ఒక్కో నియోజకవర్గంలో 2,500 మంది విద్యార్థులతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కడుతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారని, బిల్డింగ్‌ లు మాత్రమే కడుతున్నామని జీవోలో పేర్కొన్నారని తెలిపారు. కేసీఆర్‌ గతంలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారని, వాటిలో చదివిన విద్యార్థులు ఐఐటీ, ఎయిమ్స్‌ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించారని తెలిపారు. రెసిడెన్షియల్‌ లా కాలేజీ కూడా కేసీఆర్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోన్న1,023 గురుకులాలు కొనసాగిస్తారా, ఊడగొడుతారా అనే విషయంలో ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వాలని కోరారు. గురుకులాలకు బిల్డింగ్స్‌ లేవని పేరు మార్చుతున్నారా.. కేసీఆర్‌ పేరు తుడిచి పెట్టేందుకే ఈ ప్రయత్నమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను చూస్తే ఉన్న గురుకులాలను ఊడగొడుతున్నట్టే తెలుస్తుందని, అదే జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.

First Published:  14 Oct 2024 5:35 PM IST
Next Story