జగ్గారెడ్డి రేవంత్‌కు షాకిస్తారా..?
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు జగ్గారెడ్డి.. మంత్రి కేటీఆర్‌ని కలవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య సరదా సంభాషణ కూడా జరిగింది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కోసం మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డిలు తనను ఉపయోగించుకున్నట్లు ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం ఉపయోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తనకు ఏ పని చెప్పినా చేసే వాడినని, కీలకమైన టాస్క్‌లనూ పూర్తి చేశానని చెప్పారు. వారు అప్పజెప్పిన పని పూర్తయ్యే వరకూ ఫాలోఅప్ చేస్తుండేవారన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యేంతవరకు ఎంత కష్టపడ్డారో.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతే కష్టపడ్డారని గుర్తుచేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు గత రెండేళ్లుగా రాష్ట్ర నాయకత్వంలో అలాంటి నేతలు లేకుండా పోయారని తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు కావడంతో మీడియా చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు జగ్గారెడ్డి.. మంత్రి కేటీఆర్‌ని కలవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య సరదా సంభాషణ కూడా జరిగింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ కలిసి అసెంబ్లీ ఆవరణలో వెళ్తుండగా మంత్రి కేటీఆర్ చూసి పలకరించారు. ఈ క్రమంలో టీ షర్ట్‌లో ఉన్న జగ్గారెడ్డిని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎట్ల అన్న.. అంటూ సరదాగా కామెంట్ చేశారు. దీనికి స్పందించిన జగ్గారెడ్డి టీ షర్ట్ వేసుకుంటే పిల్లలమైపోతామా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. తర్వాత మీ ఇద్దరికీ దోస్తాన్ ఎక్కడ కుదిరింది అంటూ మామిల్ల రాజేందర్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. దానికి మాది ఒకటే కంచం.. ఒకటే మంచం అంటూ రాజేందర్ రిప్లై ఇచ్చారు. దీంతో వెంటనే అయితే ఈసారి సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తావా అంటూ రాజేందర్‌ను కేటీఆర్ ప్రశ్నించగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. తర్వాత మీ దగ్గరకు పట్టుకొస్తానంటూ రాజేందర్ సమాధానమిచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ జగ్గారెడ్డి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పెద్దల మధ్యవర్తిత్వంతో గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి.. తాజాగా మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.