చార్మినార్ మే కౌన్ లడేగా..?
తనకు చార్మినార్, తన కుమారుడికి యాకుత్‌పురా టికెట్ కావాలని ముంతాజ్‌ఖాన్ అడిగారు. అయితే అతని వ్యవహరశైలి నచ్చని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముంతాజ్‌ఖాన్‌కు కూడా టికెట్ ఇవ్వలేదు.
చార్మినార్.. హైదరాబాద్ ల్యాండ్ మార్క్. ఇప్పుడా అసెంబ్లీ నియోజకవర్గం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ల్యాండ్ మార్క్‌గా మారబోతోందా..? ఎంఐఎం టికెట్ నిరాకరించడంతో ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ అలర్టయింది. ముంతాజ్ ఖాన్ వస్తానంటే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తే అక్కడ పోటీ మహారంజుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
అసలు ఏం జరిగింది?
తనకు చార్మినార్, తన కుమారుడికి యాకుత్‌పురా టికెట్ కావాలని ముంతాజ్‌ఖాన్ అడిగారు. అయితే అతని వ్యవహరశైలి నచ్చని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముంతాజ్‌ఖాన్‌కు కూడా టికెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో రెండుసార్లు హైదరాబాద్ నగర మేయర్‌గా పని చేసిన జుల్ఫికర్‌కు అవకాశమిచ్చారు. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని, ఇటీవల తనపై పోలీసులు కేసు పెట్టినా ఓవైసీ సాబ్ పట్టించుకోలేదని ఆగ్రహంతో ఉన్న ముంతాజ్‌ఖాన్ రెండురోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు.
యాకుత్‌పురాను వదులుకుని చార్మినార్‌కు వచ్చినందుకు ఇదా ఫలితం
వాస్తవానికి ముంతాజ్‌ఖాన్ నియోజకవర్గం యాకుత్‌పురానే. 1994 నుంచి 2014 వరకు ఓటమన్నదే లేకుండా 5సార్లు అక్కడి నుంచే గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో చార్మినార్‌లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ఓడిపోతారనే భయంతో ఎంఐఎం యాకుత్‌పురా నుంచి ముంతాజ్‌ఖాన్‌ను రంగంలోకి దించగా ఆయన అక్కడా గెలిచారు. ఈసారి తనకు చార్మినార్‌తోపాటు ముప్పై ఏళ్లుగా తనకు అనుబంధమున్న యాకుత్‌పురా అడిగితే అసలు తనకే టికెట్ లేకుండా చేశారని ముంతాజ్ మండిపడుతున్నారు
కాంగ్రెస్‌లో చేరికకు అంగీకరించినట్లేనా..?
మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నుంచి కొంతమంది మైనార్టీ నేతలు కొద్దిరోజుల క్రితం ఆయనతో మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరితే మీకు, మీ అబ్బాయికి రెండు టిక్కెట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చినట్టు సమాచారం. ముంతాజ్ ఖాన్ అంగీకరించారంటూ కాంగ్రెస్ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే సోమవారం విడుదలైన కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాలో కూడా చార్మినార్ నుంచి ముంతాజా ఖాన్ పేరు ప్రకటించకపోవడంతో ఏం జరిగిందన్నది క్లారిటీ లేదు. ముంతాజ్‌ఖాన్ పార్టీలోకి వస్తే ఇవ్వడానికి చార్మినార్ సీటు సిద్ధంగా ఉంచారు. ఆ ప్లేస్‌లో ఎవర్నీ ప్రకటించలేదు. ఆయన వస్తానంటే చార్మినార్‌తోపాటే ఇవ్వడానికి యాకుత్‌పురా సీటులోనూ అభ్యర్థిని మార్చడానికి కాంగ్రెస్ సిద్థంగానే ఉంది.