ఆ 17 సీట్లలో బీఆర్ఎస్ ఈసారైనా పాగా వేసేనా..?
ఈసారైనా ఈ నియోజకవర్గాల్లో పాగా వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలో వరుసగా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ మారింది. అయితే బీఆర్ఎస్ రెండుసార్లు అధికారం చేపట్టినప్పటికీ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా బోణీ కొట్టలేకపోయింది. అందుకే ఈసారి ఆ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలుపొందడానికి గులాబీ బాస్ ప్లాన్ వేశారు.
తెలంగాణ ఏర్పడకముందు బీఆర్ఎస్‌కు ఉద్యమ పార్టీగానే పేరుంది. భారీ సంఖ్యలో సీట్లు గెలుపొందింది ఎప్పుడూ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో సొంత రాష్ట్రం సాధించిన పార్టీగా పేరు తెచ్చుకొని కూడా కేవలం 63 సీట్లలో మాత్రమే గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలైన టీడీపీ, వైసీపీ కూడా కొన్ని స్థానాల్లో విజయం సాధించాయి.
అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనే పేరు నుంచి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారింది. ఆ తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. 2014లో సాధించిన సీట్ల కంటే ఎక్కువగా 88 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అన్ని స్థానాల్లో విజయం సాధించినప్పటికీ 17 నియోజకవర్గాల్లో మాత్రం మొదటిసారి, రెండోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేకపోయింది.
ఆ 17 స్థానాల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు బలమైన పోటీగా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఉండటంతో అనుకున్నన్ని స్థానాల్లో గులాబీ పార్టీ గెలవలేకపోతోంది. ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ ఫ్రెండ్లీగానే పోటీ చేస్తోంది. అందువల్లే ఆ స్థానాల్లో గెలవలేని పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి తెలంగాణవాదం పెద్దగా లేదు. అందువల్ల ఆ జిల్లాలో బీఆర్ఎస్ బలపడలేకపోతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషామహల్, మలక్‌పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, యాకత్ పుర, బహదూర్ పుర, నాంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇంతవరకు ఎప్పుడూ బీఆర్ఎస్ గెలవలేదు.
ఈసారైనా ఈ నియోజకవర్గాల్లో పాగా వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలో వరుసగా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల వారిని నేరుగా కలుస్తూ వారితో మమేకం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే విధంగా ప్రజల మద్దతు కూడగడుతున్నారు.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లెందు, మధిర, వైరా, పాలేరు, భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వరుసగా ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దళిత బంధు సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇస్తున్నారు. గులాబీ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టి ప్రజలను కలుస్తున్న నేపథ్యంలో ఈ దఫా అయినా ఈ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పాగా వేస్తుందో లేదో చూడాలి.