Telugu Global
Telangana

కాంగ్రెస్ వీక్‌ ఉంటేనే బీజేపీ గెలుస్తుందా..?

ఇదే సమయంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్ల పెద్దగా ఫైట్ ఇవ్వలేకపోయింది. అలాగే కేసీఆర్ వ్యతిరేకశక్తులన్నీ సైలెంటుగా బీజేపీకి మద్దతుగా నిలవటంతో రఘునందనరావు గెలిచారు.

కాంగ్రెస్ వీక్‌ ఉంటేనే బీజేపీ గెలుస్తుందా..?
X

కాంగ్రెస్ ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తోంది. చరిత్రను తిరగేస్తే ఈ సత్యం బోధపడుతుంది. తొందరలో జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో గెలుపోటములు ఎవరిదో ఇప్పుడే ఎవరు చెప్పలేరు. కానీ, జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విషయాలను గమనిస్తే జరిగిందేమిటో అందరికీ బోధపడుతుంది. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండుచోట్ల బీజేపీ గెలిస్తే ఒకచోట టీఆర్ఎస్ గెలిచింది.

ఇక విషయానికి వస్తే మొదటి ఉపఎన్నిక దుబ్బాకలో జరిగింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా రఘునందనరావు గెలిచారు. తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచారు. ఈ రెండుచోట్లా కామన్ పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ బాగా బలహీనంగా ఉండటం. దుబ్బాకలో నిజానికి టీఆర్ఎస్సే గెలవాల్సింది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే అధికారపార్టీ ఇక్కడ ఓడిపోయింది. ఇక్కడ రఘనందనరావు మొదటి నుండి బాగా పట్టుదలగా ప్రచారం చేసుకుంటే.. టీఆర్ఎస్ చివరి నిముషం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇదే సమయంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్ల పెద్దగా ఫైట్ ఇవ్వలేకపోయింది. అలాగే కేసీఆర్ వ్యతిరేకశక్తులన్నీ సైలెంటుగా బీజేపీకి మద్దతుగా నిలవటంతో రఘునందనరావు గెలిచారు. ఇక హుజూరాబాద్ లో కూడా దాదాపు ఇదే సీన్ రిపీటైంది. కేసీఆర్ ను దెబ్బకొట్టే టార్గెట్ తో తన ఓట్లను బీజేపీకి కాంగ్రెస్ త్యాగంచేసింది. దీనికితోడు ఈటలపైన జనాల్లో ఉన్న సింపతీ కూడా వర్కవుటవ్వటంతో బీజేపీ గెలుపు సులభమైంది. తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కసితో పోటీచేయటంతో గెలిచింది.

ఇక్కడ కాంగ్రెస్ కూడా గట్టిగానే పోరాటం చేసింది. దాంతో ఇక్కడ బీజేపీ బలహీనపడిపోయింది. అంటే త్రిముఖపోటీగా గట్టిగా జరిగిన ఎన్నికలో బీజేపీ గెలవలేకపోయిందన్నది అర్థ‌మవుతోంది. ఇప్పుడు మునుగోడులో త్రిముఖపోటీనే జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం జనాల్లో తగ్గిపోతోంది. అసలే పార్టీకి ఈ నియోజకవర్గంలో పట్టులేదు. దానికితోడు అభ్యర్థి రాజగోపాల్ కు ప్రచారంలో ప్రతిచోటా చుక్కెదురవుతోంది. దాంతో బీజేపీ ఇప్పుడే చేతులెత్తేసిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  23 Oct 2022 2:44 PM IST
Next Story