Telugu Global
Telangana

ఫ్లోర్ లీడర్ లేకుండానే ఆఖరి సమావేశాలకు హాజరుకానున్న బీజేపీ? రఘునందన్ రావు ఆశలకు బ్రేక్!

వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫ్లోర్ల్ లీడర్ పదవి నుంచి కూడా తప్పించింది.

ఫ్లోర్ లీడర్ లేకుండానే ఆఖరి సమావేశాలకు హాజరుకానున్న బీజేపీ? రఘునందన్ రావు ఆశలకు బ్రేక్!
X

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 31న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ సారి కేబినెట్‌లో 40 నుంచి 50 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. కాగా, ఈ సారి కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ గడువు మరో నాలుగు నెలల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ అవసరం లేదని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక సీటు గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హూజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలిచారు. అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌ను పార్టీ ఎంపిక చేసింది. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫ్లోర్ల్ లీడర్ పదవి నుంచి కూడా తప్పించింది. ఆయనపై పీడీ యాక్టు కూడా నమోదవడంతో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద తిరిగి వచ్చినా.. బీజేపీ మాత్రం సస్పెన్షన్ ఎత్తేయలేదు.

కొంత కాలంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి తనకు వస్తుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రఘునందన్ రావు మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ, ఫ్లోర్ లీడర్ పదవి కానీ, జాతీయ స్థాయిలో పార్టీ పదవి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అధిష్టానం కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. రఘునందన్ రావు డిమాండ్‌పై ఏ మాత్రం చర్చ జరగలేదు. అసెంబ్లీ సమావేశాల నాటికి తనకు ఫ్లోర్ లీడర్ పదవి వరిస్తుందని ఆశతో ఎదురు చూశారు.

కాగా, నాలుగు నెలల్లో అసెంబ్లీ గడువు ముగుస్తుంటే.. ఇక ఫ్లోర్ లీడర్ పదవితో పనేముందని కిషన్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తున్నది. తనకు మంచి పదవి వస్తుందని ఆశించిన రఘునందన్ రావుకు చుక్కెదురైంది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మీడియా స్ట్రాటజీ టీంలో.. సోషల్ మీడియా బాధ్యతలను ఎంపీ అర్వింద్‌తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలపై రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. నాలుగు నెలల పాటైనా ఫ్లోర్ లీడర్ పదవే ఇస్తే సరిపోయేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది.

First Published:  29 July 2023 3:25 AM GMT
Next Story