ఎన్టీఆర్ స్మారక నాణేనికి.. ఎందుకంత క్రేజ్..?
తాము ఏ స్మారక నాణేన్నీ ఇంతవరకూ 10వేలకు మించి ముద్రించలేదని, కానీ, ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎక్కువ మంది కొంటారని 20 వేల కాయిన్స్ ముద్రించామని మింట్ అధికారులు చెప్పారు.
నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 100 రూపాయల స్మారక నాణేనికి యమా క్రేజ్ నడుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం కాయిన్‌ను విడుదల చేశారు. మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి, సైఫాబాద్‌ల్లో ఉన్న టంకశాల (మింట్)ల్లో అమ్మకాలు చేస్తే తొలిరోజే జనం విరగబడ్డారు.
తొలిరోజే 5వేలు కొన్నారు
పేరుకు 100 రూపాయల నాణెం అయినా.. వెండి, ఇతర లోహాలు కలిపి తయారు చేసిన ఈ నాణెం కనీస ధర రూ.4వేల పైమాటే. ఇందులో అత్యధికంగా అభిమానులు కొంటున్న నాణేన్ని చెక్కపెట్టెలో ఇస్తున్నారు. దీని ఖరీదు 4,850. రెండు మింట్‌ల్లో కలిపి 12వేల నాణేలను అందుబాటులో ఉంచితే తొలిరోజే 5వేల మంది కొనుగోలు చేశారని అధికారులు చెప్పారు. మరోవైపు https://www.indiagovtmint.in/ ఆన్‌లైన్‌లో 5 నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ కనిపించింది.
ఎన్టీఆర్‌కు కేంద్రం ఇచ్చిన గుర్తింపు అంటున్న అభిమానులు
తాము ఏ స్మారక నాణేన్నీ ఇంతవరకూ 10వేలకు మించి ముద్రించలేదని, కానీ, ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎక్కువ మంది కొంటారని 20 వేల కాయిన్స్ ముద్రించామని మింట్ అధికారులు చెప్పారు. ఇవి కూడా అయిపోయి, మళ్లీ నాణేలను అచ్చువేయించాల్సిన అవసరం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాజికవర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ను అభిమానించేవారు ఉండబట్టే ఇలా ఆయన స్మారక నాణెం కోసం లైన్లో నిల్చున్నామని తెలంగాణకు చెందిన ఓ అభిమాని చెప్పారు. తనకు, బంధు మిత్రులకు కలిసి ఏడు నాణేలు కొనుగోలు చేయడానికి లైన్లో ఉన్నానని చెప్పారు.
సినీ, రాజకీయ రంగాల్లో తిరుగులేని ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఇదని, దీన్ని తమ దగ్గరా భద్రపరుచుకోవాలని కొంటున్నామని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ నాణెం విడుదలకు కుటుంబ సభ్యులు వెళ్లడం, చివర్లో భార్యగా ఉన్న లక్ష్మీపార్వతిని పిలవకపోవడం, వారసుడని అభిమానులు భావించే జూనియర్ ఎన్టీఆర్ లైట్ తీసుకోవడంతో ఈ అంశం మూడు నాలుగు రోజులుగా ప్రధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో ఉందని, ఈ విషయం కూడా కొనుగోళ్లు ఈస్థాయిలో ఉండటానికి కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
*