Telugu Global
Telangana

శుక్రవారంపై వక్ర దృష్టి

బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్తను అనరాని మాటలన్నప్పుడు ముస్లింల ప్రతి చ‌ర్య‌ ఎలా ఉంటుందో అన్న దృష్టే తప్ప ఆయన మాటల్లోని విద్వేషాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.

శుక్రవారంపై వక్ర దృష్టి
X

శుక్రవారం అంటే హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి ఉంటుంది ఎందుకో! మతపరమైన విభేదాలు తలెత్తినప్పుడు వాటి మూలాల్లోకి వెళ్లి బాధ్యులు ఎవరో విచారించడం, వాస్తవాన్ని అంగీకరించడం ఎటూ అలవాటు లేదు.

బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్తను అనరాని మాటలన్నప్పుడు ముస్లింల ప్రతి చ‌ర్య‌ ఎలా ఉంటుందో అన్న దృష్టే తప్ప ఆయన మాటల్లోని విద్వేషాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. మత కలహాలు, మతోన్మాదం ముస్లింలకే పరిమితమైందన్న ధోరణిలోనే ఉంటాం. రాజా సింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తరువాత వాటిని అభ్యంతర పెట్టిన వారు, ఖండించిన వారు ఎవరూ లేరు. పైగా ఆయనను అరెస్టు చేసినందుకు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేసిన వారు మాత్రం కోకొల్లలుగా కనిపించారు.

ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగానే గురువారం తరువాత, శనివారానికి ముందు శుక్రవారం వచ్చింది. ముస్లింలు శుక్రవారం నమాజ్‌ చేస్తారు కనక మక్కా మసీదుతో సహా పాత బస్తీలోని ఇతర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలా చేసినందుకు పోలీసులు కూడా తక్కువ ప్రచారం ఏమీ చేసుకోలేదు. అంటే శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేసిన తరవాత ప్రతీకార దాడులకు దిగుతారని పోలీసులు కూడా అభిప్రాయపడ్డారన్న మాట. ఇది మొదటి సారేం కాదు. ఎప్పుడు మతోద్రిక్తతలు తలెత్తినా దేవాలయాల దగ్గర కట్టుదిట్టాలు ఉండవు కానీ, మసీదుల దగ్గర మాత్రం పోలీసు బలగాలు మోహరిస్తారు. నమాజ్ తరువాత నినాదాలు చేయకూడదని లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని పెద్దగా హిందూ అభిమానులు ఎవరూ పట్టించుకోరు. అందరి దృష్టీ శుక్రవారం ఎలా గడుస్తుందన్న అంశం మీదే ఉంటుంది.

శుక్రవారం ముస్లింలు అల్లర్లకు దిగే రోజు అన్న అభిప్రాయం ఆ మతాన్ని ఈసడించే వారిలోనే కాకుండా పోలీసులలో కూడా గూడు కట్టుకుంది. మతకలహాలు చెలరేగడానికి పంచాంగాలు, జంత్రీలు చూడరని ఎందుకు అనుకోరో అంతుబట్టదు.

First Published:  27 Aug 2022 1:16 PM IST
Next Story