Telugu Global
Telangana

'సీతక్క' సెగ్మెంట్ నుంచే రేవంత్ పాదయాత్ర ఎందుకు? లాజిక్ చెప్పిన తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ గుమ్మమైన ఖమ్మం నుంచి కూడా ప్రారంభిచాలని భావించారు. ఈ జిల్లాలో రేవంత్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన అనుచరగణం కూడా ఉన్నది.

సీతక్క సెగ్మెంట్ నుంచే రేవంత్ పాదయాత్ర ఎందుకు? లాజిక్ చెప్పిన తెలంగాణ కాంగ్రెస్
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని, తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కోటి ఆశలతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవ్వాళ్టి నుంచి ములుగు నియోజకవర్గ పరిధిలోని మేడారంలో 'యాత్ర' ప్రారంభించనున్నారు. రేవంత్ యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై సన్నిహితులు, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సుదీర్ఘంగా చర్చించారు. చేవెళ్ల లేదా కొడంగల్ నుంచి ప్రారంభించాలని కొందరు ప్రతిపాదించినా అది కార్యరూపం దాల్చలేదు.

తెలంగాణ గుమ్మమైన ఖమ్మం నుంచి కూడా ప్రారంభిచాలని భావించారు. ఈ జిల్లాలో రేవంత్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన అనుచరగణం కూడా ఉన్నది. అప్పట్లో తన వర్గానికి చెందిన బానోత్ హరిప్రియను టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చి 2018లో సీటు ఇప్పించి మరీ గెలిపించుకున్నారు. కానీ ఆ తర్వాత హరిప్రియ అధికార బీఆర్ఎస్‌లో చేరారు. ఖమ్మం జిల్లాలో అయితే ప్రారంభ సభ ఘనంగా నిర్వహించవచ్చని కూడా భావించారు. కానీ అనేక తర్జనభర్జనల అనంతరం ములుగు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు.

మేడారం నుంచి యాత్ర ప్రారంభించడం వెనుక చెల్లెలి సెంటిమెంట్ ఉందని రేవంత్ రెడ్డి భావించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభించారు. సబితా ఇంద్రారెడ్డిని సోదరి సమానంగా భావించే వైఎస్ఆర్ అక్కడి నుంచి పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేవెళ్ల నుంచే పలు పథకాలను మొదలు పెట్టేవారు. దీంతో ఆమెను చేవెళ్ల చెల్లెమ్మగా కూడా అప్పట్లో మీడియాలో అభివర్ణించేవారు. తనకు టీడీపీ నుంచి మద్దతుగా నిలిచి.. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అండగా ఉంటున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కపై రేవంత్‌కు చాలా అభిమానం ఉంది.

వైఎస్ఆర్ లాగే తాను కూడా సిస్టర్ సెంటిమెంట్‌ను నమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెల్లెలి సెంటిమెంట్ కలిసి వస్తుందని కూడా రేవంత్ భావించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. పైగా తెలంగాణ ప్రజానీకం సమ్మక్క, సారాలమ్మ పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు చూపుతారు. ఇటీవల మినీ జాతర కూడా నిర్వహించారు. ఇవన్నీ చూసుకున్న రేవంత్ మేడారాన్ని ఎంచుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో రేవంత్ యాత్ర పట్ల కొంత మందిలో వ్యతిరేకత ఉన్నా.. మెజార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.

ప్రతీ రోజు 15 కిలోమీటర్ల చొప్పున రేవంత్ నడుస్తారని.. దీనిని పర్యవేక్షించడానికి ఇప్పటికే గాంధీభవన్‌లో ఒక మానిటరింగ్ , కోఆర్డినేషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రేవంత్ యాత్రకు భారీ స్పందన లభించడం ఖాయమని.. తప్పకుండా ఇది పార్టీలో ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నారు.

First Published:  6 Feb 2023 8:53 AM IST
Next Story