హుస్నాబాద్ లోనే తొలిసభ.. ఎందుకో చెప్పిన హరీష్ రావు
సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. హుస్నాబాద్ లోనే తొలి ఎన్నికల సభ ఎందుకు నిర్వహిస్తున్నామనే విషయాన్ని ఆయన వివరించారు.
ఈనెల 15న అభ్యర్థులకు బీ ఫామ్ లు ఇచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. హుస్నాబాద్ లో అదేరోజు తొలి ఎన్నికల సభ నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సభా ప్రాంగణానికి వెళ్లి స్థానిక నాయకులతో మాట్లాడారు. హుస్నాబాద్ లోనే తొలి ఎన్నికల సభ ఎందుకు నిర్వహిస్తున్నామనే విషయాన్ని ఆయన వివరించారు.
హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీకటాక్ష నియోజకవర్గం అని చెప్పారు మంత్రి హరీష్ రావు. గత ఎన్నికల్లో కూడా మొదటి సభ ఇక్కడే నిర్వహించామని, అందుకే ఈసారి కూడా ఇదే నియోజకవర్గాన్ని తొలిసభకోసం ఎంపిక చేసుకున్నామని చెప్పారు. తొలి ఎన్నికల సభ హుస్నాబాద్ లో నిర్వహించడం అంటే.. ఇక్కడి ప్రజల మీద సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమ, నమ్మకం అని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫేక్ సర్వేలు, గూగుల్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు హరీష్ రావు. కనీసం టికెట్లు ఇచ్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలు, మతకల్లోలాలకు చిరునామా అని అన్నారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ టికెట్లు కేటాయించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమన్నారు. 2014, 18 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు.