వైనాట్ 119.. కేసీఆర్ ఆ మాట ఎందుకు అనరంటే..?
ఈసారి 95నుంచి 105 స్థానాల్లో మన పార్టీ గెలుస్తుందని మాత్రమే కేసీఆర్ ఎందుకు చెబుతున్నారు. వైనాట్ 119 అని ఎందుకు అనడంలేదు..?
వైనాట్ 175. ఏపీలో మారుమోగిపోతున్న వైసీపీ నినాదం ఇది. ఈసారి కుప్పంలో కూడా టీడీపీని ఓడిస్తామంటూ వైసీపీ కాన్ఫిడెంట్ గా ఉంది. సీఎం జగన్ ఆమేరకు నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. 175కి 175 స్థానాలు మనవేనంటున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అంత కాన్ఫిడెంట్ గా ఉంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మాట ఎందుకు చెప్పడంలేదు..? ఈసారి 95నుంచి 105 స్థానాల్లో మన పార్టీ గెలుస్తుందని మాత్రమే ఆయన ఎందుకు చెబుతున్నారు. వైనాట్ 119 అని ఎందుకు అనడంలేదు..?
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మూడోసారి కూడా అధికారం గ్యారెంటీ అని సర్వేలు చెబుతున్నాయి. పోనీ ప్రతిపక్షాలు బలపడిపోయాయా అంటే అదీ లేదు, అభ్యర్థుల జాబితా ప్రకటించడానికే కిందామీదా పడుతున్నాయి. ప్రజల్లో కేసీఆర్ పై అసంతృప్తి ఉందా అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. దళితబంధు లాంటి సంచలన పథకాలు తెలంగాణలో ఉన్నాయి. తలసరి ఆదాయంలోనూ, పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉంది. పైగా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే దాదాపు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవడం ఖాయం. విజయం ఖాయమని తెలిసినా కూడా కేసీఆర్ ఎప్పుడూ వైనాట్ 119 అనలేదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన ఎప్పుడూ చూపించలేదు. ప్రతిపక్షాలను మరీ అంత తేలిగ్గా తీసుకోవడంలేదు. ప్రతి సభలోనూ.. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతిపాలవుతుందని ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు.
జగన్ కాన్ఫిడెన్స్ ఏంటి..?
2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్ల భారీ మెజార్టీ వచ్చి ఉండొచ్చు కానీ.. జగన్ తో పోల్చి చూస్తే బీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ గొప్పగా ఉంది. ఏపీలో 2024 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి మరీ ఏకపక్ష విజయం లభిస్తుందని చెప్పలేం. ఉచితాలపై చాలామంది సంతృప్తిగా ఉన్నా.. అభివృద్ధి పనులు అటకెక్కాయనే అసంతృప్తి కూడా కనపడుతోంది. ఉద్యోగ వర్గాలు తమ డిమాండ్లు నెరవేర్చుకోలేక సమయంకోసం ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకేం తీసిపోలేదు వైసీపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిపోకుండా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. ఈ దశలో కూడా జగన్ వైనాట్ 175 అంటున్నారు. అక్కడ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నా కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య అది చీలిక పేలికలవుతుంది. ఆ విషయం తెలిసి కూడా కేసీఆర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంలేదు, ప్రదర్శించరు కూడా. ఏడాది వ్యవధిలో జరిగే రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎవరి లెక్కల్ని నిజం చేస్తాయి, ఎవరి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి.. వేచి చూడాల్సిందే.