ఇరిగేషన్ శాఖపై వైట్‌పేపర్ ఎందుకు లేదంటే..!
డిసెంబర్ 27న ఇరిగేషన్‌పై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ.. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అసెంబ్లీ పూర్తిస్థాయి సమావేశాలు జరిగాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇరిగేషన్ సెక్టార్‌పైనా వైట్‌పేపర్ విడుదల చేస్తుందని అంతా భావించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లోని పిల్లర్ కుంగడం, వరదల సమయంలో పంప్‌హౌస్‌లు మునగడం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరోపించడమే ఇందుకు కారణం. అయితే ఇరిగేషన్ రంగంపై ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేయకుండానే అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఇక కుంగిన మేడిగడ్డ పిల్లర్‌ను ఎవరు రిపేర్ చేయాలన్న విషయంపైనా సందిగ్ధత నెలకొంది. కాంట్రాక్టర్‌దే బాధ్యత అని ఎన్నికల ముందు గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రిపేర్ ఖర్చును తాము భరించలేమంటూ నిర్మాణ సంస్థ చెప్పినట్లు సమాచారం. పిల్లర్లు మునిగిపోవడానికి కారణం, నష్టానికి బాధ్యులు ఎవరు, దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చుకు సంబంధించిన వివరాలు శ్వేతపత్రంలో ఉంటాయని అందరూ భావించారు.
డిసెంబర్ 27న ఇరిగేషన్‌పై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ.. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఇక నీటి పారుదళ శాఖకు పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడంతో కచ్చితమైన సమాచారాన్ని రాబట్టడం ప్రస్తుత ప్రభుత్వానికి కష్టంగా మారింది. త్వరలోనే పూర్తిస్థాయి సమాచారంతో వస్తామని.. నిర్లక్ష్యానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.