Telugu Global
Telangana

ఆస్పత్రులపై అధ్యయనం చేస్తామనంటే ప్రభుత్వానికి భయమెందుకు?

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లకుండా డాక్టర్‌ రాజయ్య, డాక్టర్‌ సంజయ్‌, డాక్టర్‌ ఆనంద్‌ లను వారి ఇళ్ల వద్దే ఆరెస్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

ఆస్పత్రులపై అధ్యయనం చేస్తామనంటే ప్రభుత్వానికి భయమెందుకు?
X

రాష్ట్రంలో ప్రభుత్వం మాతా శిశు మరణానలు దాచిపెడుతున్నదని కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. దీనిపై నిజాలు నిగ్గు తేల్చడానికి, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం వైద్యులైన బీఆర్‌ఎస్‌ నేతలు డాక్టర్‌ సంజయ్‌, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ లతో బీఆర్‌ఎస్‌ కమిటీ ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని బీఆర్‌ఎస్‌ నేతల కమిటీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు గాంధీ ఆస్పత్రికి వెళ్లకుండా రాజయ్య, సంజయ్‌, ఆనంద్‌ ఇళ్లకు పోలీసులు వెళ్లారు. వీరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

దీనిపై స్పందించిన బీఆర్‌ఎస్‌ ఆస్పత్రులపై అధ్యయనం చేస్తామనంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది? మా నేతలు గాంధీ ఆస్పత్రికి వెళ్తామంటే భయమెందుకు? ఆస్పత్రిలో మాతా శిశు మరణాలను ప్రభుత్వం దాస్తున్నదా? ప్రభుత్వ వైఫల్యం బైటపడుతుందని భయపడుతున్నారా? అని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తున్నది. తమ ఇళ్ల నుంచి పోలీసులు వెళ్లిపోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలన్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద బీఆర్‌ఎస్‌ పర్యటన దృష్ట్యా పోలీసులు భద్రత పెంచారు. ఆస్పత్రిలోకి నేతలు వెళ్లకుండా కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నది?: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేయడానికి కమిటీ వేశాం. నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ వేశామని కేటీఆర్‌ తెలిపారు. కమిటీ గాంధీ అస్పత్రికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నది? అని ప్రశ్నించారు. సీఎం, కాంగ్రెస్‌ ఎంత ప్రయత్నించినా వాస్తవాలు దాచలేరు. వాస్తవ పరిస్థితిని బైటికి తీసుకొచ్చేవరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

First Published:  23 Sept 2024 9:25 AM IST
Next Story