Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?

అతి దగ్గరగా ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే, సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆయన రాజకీయ చాణక్యం అర్థం అవుతుంది.

సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?
X

ఒకే సారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నికల కాకను రగిలించారు. దాదాపు సిట్టింగులు అందరికీ సీట్లు కేటాయించడంతో పాటు ఈ సారి రెండు స్థానాల నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అతి దగ్గరగా ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే, సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆయన రాజకీయ చాణక్యం అర్థం అవుతుంది.

38 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఓటమి ఎరుగని నాయకుడిగా సీఎం కేసీఆర్ రికార్డులకు ఎక్కారు. తెలంగాణలో మూడో సారి అధికారంలోకి వచ్చి.. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ద్వారా ముందుగా కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షుల విమర్శలకు చెక్ పెట్టారు. కొంత కాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గజ్వేల్‌లో ఈ సారి ఓడిపోతారని.. కేసీఆర్ కొత్త సీటును వెతుక్కుంటారని రేవంత్ విమర్శించారు. అందుకే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో తాము బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టడానికి కామారెడ్డిని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్ 1985 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కూడా సిద్ధిపేట (ఉమ్మడి కరీంనగర్‌లో) జిల్లాలో భాగమే. దీంతో ఈ సారి ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. దీనిలో భాగంగానే కామారెడ్డిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు.. 2004లో జరిగిన ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేశారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావుపై 1,31,168 ఓట్ల మెజార్టీతో కరీంనగర్ నుంచి గెలుపొందారు. బీజేపీ నుంచి వరుసగా 1998, 1999లో గెలిచిన సీనియర్ నాయకుడైన విద్యాసాగర్ రావుపై విజయం సాధించడంతో కేసీఆర్‌లో ఆత్మస్థైర్యం పెరిగింది. తెలంగాణ సాధించాలంటే ఎంపీగా ఢిల్లీలో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి.. సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

కాగా, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అబద్దాలను గ్రహించిన కేసీఆర్.. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా కరీంనగర్ పార్లమెంటు సీటుకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ టి.జీవన్ రెడ్డిని బరిలోకి దింపింది. అప్పట్లో అధికారంలో ఉన్న సీఎం వైఎస్ఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని కుయుక్తులు పన్నారు. అయితే ఉపఎన్నికలో కేసీఆర్ 2,01,582 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించారు.

అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎం. సత్యానారాయణ రావు విసిరిన సవాలును స్వీకరించిన టీఆర్ఎస్ అధినేత.. మరో సారి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనతో పాటు ఆలె నరేందర్, వి.వినోద్ కుమార్, టి. మధుసూదర్ రెడ్డి. డి.రవీంద్ర నాయక్‌లతో కూడా రాజీనామా చేయించారు. 2008లో కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డిపై గెలిచారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ మరింత బలంగా నాటుకొని పోయింది.

2009లో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా, అప్పటికే ఉత్తర తెలంగాణలో ప్రత్యేర రాష్ట్ర సెంటిమెంట్ బలంగా ఉండటంతో.. ఈసారి దక్షిణ తెలంగాణపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఎవరూ ఊహించని రీతిలో మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ డి. విఠల్ రావుపై 20వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ గెలుపుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పాలమూరు జిల్లాలో కూడా బలపడింది. కేసీఆర్ ఏ లక్ష్యంతో అయితే మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేసుకున్నారో.. ఆ లక్ష్యం నెరవేరింది.

ఇక సీఎం రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమయ్యింది. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాను అన్నం, నీళ్లు ముట్టనని చెప్పి సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనను ఉమ్మడి కరీంనగర్‌లో అరెస్టు చేసి.. ఆ తర్వాత ఖమ్మం జైలులో ఉంచారు. దీంతో ఖమ్మం జిల్లాలో కూడా తెలంగాణ ఉద్యమం మరింతగా బలపడింది. అప్పటి వరకు మామూలుగా ఉన్న ఉద్యమం.. కేసీఆర్ జైలులో ఉండటంతో ఖమ్మంలో కూడా బలపడింది. దీంతో చివరకు యూపీఏ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన బయటకు వచ్చింది. ఆ తర్వాత 2013లో బిల్ పాస్ కావడం.. 2014 జూన్ 2 నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక చరిత్ర.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేశారు. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన సిద్దిపేట నుంచి హరీశ్ రావు వరుసగా గెలవడంతో.. కొత్తగా గజ్వేల్‌ను కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గజ్వేల్ నుంచి మాత్రమే సీఎం కేసీఆర్ పోటీ చేశారు. ఇక ఇప్పుడు మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలను కేసీఆర్ ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

కాగా.. కేసీఆర్ ఎప్పుడో నియోజకవర్గం మారాలని నిర్ణయించకున్నాయి. అయితే గజ్వేల్‌లో ఓడిపోతారనే భయంతోనే కామారెడ్డికి వెళ్లారనే విమర్శలకు తావు ఇవ్వకూడదనే రెండింటి నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేయడం వల్ల ఒకే సారి కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టే అవకాశం ఉండటంతో కేసీఆర్ కామారెడ్డిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్థన్‌ను ఓడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వరుస ఓటములతో డీలా పడిన షబ్బీర్అలీ.. ఈ సారి కామారెడ్డిని కైవసం చేసుకోవడానికి అనేక వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. షబ్బీర్ అలీ కేవలం కామారెడ్డి మాత్రమే కాకుండా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలరు.

మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బీజేపీ గెలిచింది. ఈ సారి కూడా ఈ రెండు లోక్‌సభ స్థానాలపై బీజేపీ కన్నేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో నిలబడి గెలుపొందితే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒకే సారి చెక్ పెట్టినట్లు ఉంటుందని అంచనా వేసుకున్నారు. కేసీఆర్ కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే దాని ప్రభావం ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాపై కూడా ఉంటుంది. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టల చందంగా.. కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే.. గజ్వేల్ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారని తెలుస్తున్నది. అక్కడి నుంచి మరో అభ్యర్థికి (దాదాపు వంటేరు ప్రతాప్ రెడ్డికి) అవకాశం దక్క వచ్చని సమాచారం. డిసెంబర్‌లో గెలిచిన వెంటనే రాజీనామా చేస్తే.. ఆ స్థానానికి 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక కేసీఆర్‌కు కామారెడ్డిలో బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. కేసీఆర్ భార్య శోభ పుట్టినల్లు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోనాపూర్. ఒక రకంగా ఆ నియోజకవర్గానికి కేసీఆర్ అల్లుడు అనుకోవచ్చు. అక్కడ ఎంతో మంది కేసీఆర్ అనుచరులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా కామారెడ్డి నుంచి కేసీఆర్ గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇన్ని కారణాల వల్లే ఈ సారి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది.

First Published:  23 Aug 2023 8:37 PM IST
Next Story