తెలంగాణపై దుమ్మెత్తి పోసే బీజేపీ నేతలు గుజరాత్ గురించి కిక్కురుమనరెందుకు?
తెలంగాణ అప్పుల గురించి ఈ మధ్య కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి ఇంతకన్నా ఎక్కువ అప్పులున్న గుజరాత్ గురించి వారు ఎందుకు మౌనం వహిస్తున్నట్టు ?
తెలంగాణ మీద పడి ఏడ్వడానికి ప్రతిరోజూ ఓ కేంద్ర నాయకుడో, నాయకురాలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక ఇక్కడి బీజేపీ నాయకుల గురించి చెప్పక్కర్లేదు. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే వ్యతిరేకించే ప్రధాని మోడీ నుంచి మొదలు పెడితే అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్థానిక నేతలు, బండి సంజయ్, కిషన్ రెడ్డిల దాకా ప్రతి రోజూ తెలంగాణ అభివృద్దిపై మండిపోతూ ఉంటారు. ప్రతి దానికీ గుజరాత్ తో పోలిక తెస్తూ ఈ దేశానికి గుజరాత్ మోడల్ కావాలంటూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నిజానికి గుజరాత్ మోడల్ లోని డొల్ల తనం అనేక సార్లు రుజువైనప్పటికీ తప్పుడు సమాచారంతో బీజేపీ నేతలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదే తప్పుడు సమాచారంతో తెలంగాణ గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూనే ఉన్నారు.
ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ అప్పుల గురించి బోరుమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేస్తున్నదని తెలంగాణలోని ప్రతి నవజాత శిశువుకు రూ.1.25 లక్షల అప్పు ఉందంటూ ప్రచారం లంఖించుకున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదని తెలంగాణలో తలసరి అప్పు రూ.94,272గా ఉందని, ఇది కేంద్ర ఆర్థిక మంత్రి క్లెయిమ్ చేసిన దానికంటే చాలా తక్కువని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు లెక్కలతో సహా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ తప్పుడు సమాచార వ్యాపింపచేయడంలో వెనకడుగువేయడం లేదు.
ఇక బీజేపీ జాతీయ, స్థానిక నాయకులు ప్రచారం చేస్తున్న గుజరాత్ మోడల్ గురించి నిజాలు తెలుసుకుంటే వాళ్ళ ఫాల్స్ ప్రాపగాండా అర్దమవుతుంది. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన 27 ఏళ్ళల్లో అక్కడ పెరిగిన అప్పులెన్నో చూస్తే గురివింద గింజలైన బీజేపీ నాయకుల తీరు అర్దమవుతుంది.
1995లో గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ రుణం దాదాపు రూ.10,000 కోట్లు.అప్పటి నుంచి 2001-02లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రి అయిన నాటికి అప్పులు దాదాపు రూ.45,301 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
2001 నుంచి 2014లో ఆయన పదవీ కాలం ముగిసే సమయానికి, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికల ప్రకారం గుజరాత్ మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లకు పెరిగింది. చివరికి, 2021-22లో, ఈ అప్పులు అసాధారణంగా రూ. 3.2 లక్షల కోట్లకు పెరిగాయి.
ఇప్పుడు ఒక సారి గుజరాత్ తో తెలంగాణను పోల్చి చూడండి. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళయ్యింది. అయినప్పటికీ గుజరాత్ అప్పులతో పోల్చుకుంటే తెలంగాణ అప్పులు అతి తక్కువ. ప్రస్తుతం గుజరాత్ అప్పులు 3.2 లక్షల కోట్లయితే తెలంగాణ అప్పులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అదీ గాక ఆ అప్పులతో బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగా డాబు, దర్పాలకు కాకుండా తెలంగాణ విపరీతమైన ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని నిర్మించి ఆహార ధాన్యాల ఉత్ప్పత్తిని రెట్టింపుకన్నా ఎక్కువగా చేయగలిగింది. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పోల్చుకుంటే ఒక్క గుజరాతే కాదు ఏ రాష్ట్రము తెలంగాణతో పోటీపడగల స్థితిలో లేదు.
ఒకవైపు తప్పుడు సమాచారం ప్రచారం చేసే బీజేపీ నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తారు. తప్పని సరిగా మాట్లాడవలసి వస్తే పెరుగుతున్న అప్పులు ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని ప్రతిబింబిస్తాయని బిజెపి నాయకులు సమర్థించుకుంటారు. అదే విపక్షాలు పరిపాలించే రాష్ట్రాలు చేసే అప్పులపై మాత్రం యాగీ చేస్తూ ఉంటారు.
ఇక బీజేపీ నేతలు గుజరాత్ అభివృద్ది గురించి అక్కడికి వస్తున్న పెట్టుబడుల గురించి చేస్తున్న ప్రచారంలోని నిజానిజాలు కూడా పరిశీలిద్దాం.
2003 నుండి 2011 వరకు గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రంలోకి రూ.84 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించుకుంది. బీజేపీ నేతలు కూడా అవే ఫిగర్స్ ను ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ వాదనలోని అబద్దాలను బహిర్గతం చేసింది గుజరాత్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డాటా. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2003, 2011 మధ్య వచ్చిన పెట్టుబడుల హామీలలో కేవలం 8 శాతం మాత్రమే అమలు జరిగింది.
ఈ గణాంకాలు కూడా నిజానికి చాలా దూరంగా ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) అధ్యయనం ప్రకారం 2000, 2013 మధ్య భారతదేశానికి వచ్చిన వాస్తవ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)లో గుజరాత్ వాటా కేవలం నాలుగు శాతం మాత్రమే.
ప్రభుత్వ నివేదికలే ఇంత స్పష్టంగా నిజాలు బహిర్గతం చేస్తూ ఉంటే బీజేపీ నేతలు మాత్రం ఒకవైపు తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కుతూ మరో వైపు గుజరాత్ మోడల్ అనే ఓ డొల్ల ప్రచారాన్ని చేయడం దేశానికేమైనా ఉపయోగపడుతుందా ? ఫేక్ సమాచారం, ఫేక్ ప్రచారంతో బీజేపీ లాభపడుతుందేమో కానీ దేశం మాత్రం దారుణంగా నష్టపోతుంది.