Telugu Global
Telangana

బీసిలంటే ఎందుకంత మంట? .. ఆరెస్ ప్రవీణ్ కుమార్ కు సంగిశెట్టి శ్రీనివాస్ ప్రశ్న‌

''టిఎస్‌పిఎస్‌సి సభ్యుడిగా ఎవరిని నిమయమించాలి అనేది ప్రభుత్వ విశేషాధికారం. ఆ విశేషాధికారాన్ని ప్రశ్నిస్తూ సత్యనారాయణను సభ్యుడిగా అనర్హుడంటున్నారు. ఆయన నియామకాన్ని తప్పుపడుతున్నారు'' అని ప్రవీణ్ కుమార్ కు రాసిన లేఖలో సంగిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

బీఎస్పీ తెలంగాణ ఛీఫ్ ఆరెస్ ప్రవీణ్ కుమార్
X

బీఎస్పీ తెలంగాణ ఛీఫ్ ఆరెస్ ప్రవీణ్ కుమార్

గతంలో TSPSC సభ్యుడుగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ నియామకంపై బీఎస్పీ తెలంగాణ ఛీఫ్ ఆరెస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయడాన్ని ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్ ఖండించారు. బీసీలంటే ప్రవీణ్ కుమార్ కు చిన్న చూపు అని సంగిశెట్టి మండి పడ్డారు. ప్రవీణ్ కుమార్ కు సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన లేఖ పూర్తి పాఠం...

అయ్యా ప్రవీణ్‌ గారూ

బీసీలంటే ఎందుకంత మంట?

అయ్యా ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ గారూ మీకు బీసీలంటే ఎంత చిన్న చూపు ఉందో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మీరు చేసిన ట్వీట్స్‌ ద్వారా అర్థమైంది. సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి (ఆయనతో నేను జర్నలిస్టుగా కలిసి పనిచేసిన కాబట్టి నాకు కొంత పరిచయముంది) తెలంగాణ ఉద్యమంలో ముందుభాగంలో ఉన్న మిత్రుడు ఆర్‌.సత్యనారాయణ. ఉద్యమం సందర్భంలో గ్రాడ్యుయేట్స్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయిండు. సంవత్సరం కూడా ఆ పదవి అనుభవించకుండానే తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చేందుకు ఆ పదవిని తృణప్రాయంగా తలచి రాజీనామా చేసిండు. ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందున రాజకీయ నేపథ్యం ఉన్నది కాబట్టి ఆయనను టిఎస్‌పిఎస్‌సి సభ్యుడిగా నియమించేది లేకుండే అని మీరు వాదిస్తున్నారు.

ఇది తప్పుడు వాదన. టిఎస్‌పిఎస్‌సి సభ్యుడిగా ఎవరిని నిమయమించాలి అనేది ప్రభుత్వ విశేషాధికారం. ఆ విశేషాధికారాన్ని ప్రశ్నిస్తూ సత్యనారాయణను సభ్యుడిగా అనర్హుడంటున్నారు. ఆయన నియామకాన్ని తప్పుపడుతున్నారు. ఒక వ్యక్తికి బహుళ అస్తిత్వాలు ఉన్నట్టే ఆర్‌.సత్యనారాయణకు జర్నలిస్టుగా, రాజకీయ నాకుడిగా, ఉద్యమకారుడిగా, రచయితగా ఇట్లా పలు అస్తిత్వాలున్నాయి. ఇప్పటి ప్రశ్న పత్రాల లీకేజి వ్యవహారంలో ఆయనకేమన్నా సంబంధముంటే కచ్చితంగా నిలదీయండి. తప్పులు నిరూపించి జైలుకు పంపించండి. అంతేగానీ బట్టగాల్షి మీదేసే విధంగా ఒక బహుజన బిడ్డను బద్‌నామ్‌ చేసే మీ బీసీ వ్యతిరేక విధానాన్ని మార్చుకోండి. సత్యనారాయణ కన్నా ముందుకూడా ఇట్లాంటి రాజకీయ నియామకాలు జరిగినాయి. అప్పుడు లేని హల్‌చల్‌ ఇప్పుడే ఎందుకో తేలాలి. ఇక్కడ బీసీ బిడ్డ ఉన్నడు కాబట్టే ఈ దుగ్ధ అనేది అర్థమయితుంది.

ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి అధికారంలో ఉన్న సమయంలో కనీస అర్హతలు కూడా లేనివారికి ఉద్యోగాలు ఇచ్చిన కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి మాయవతిపై సిబిఐ విచారణ జరుపుతోంది. మాయవతి అధికారంలో ఉన్న 2007-12 మధ్యకాలంలో జరిగిన జాబ్‌ స్కామ్స్‌పై పత్రికలు ఇప్పటికీ రాస్తున్నాయి.

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ఇక ముందైనా బీసీలకు ఇజ్జత్‌ ఇవ్వాలనీ వినతి.

- సంగిశెట్టి శ్రీనివాస్

First Published:  18 March 2023 8:29 PM IST
Next Story