ఫీ రీయింబర్స్‌మెంట్ విడుదలపై నాన్చుడెందుకు?
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఏఐఎస్ఎఫ్
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్ లు విడుదల చేయడంలో నాన్చుడెందుకని సీఎం రేవంత్ రెడ్డిని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలకు, సీఎం అయ్యాక చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను బీఆర్‌ఎస్ విస్మరించిందని కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ పార్టీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖపై సమీక్షించే తీరిక ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. అనేక స్కూల్ బిల్డింగులు ఎక్కవ వర్షాలు కురిస్తే కూలిపోయే దుస్థితిలో ఉన్నాయన్నారు. హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల బాధలు వర్ణనాతీతం అన్నారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోతున్నాయని, వాళ్లు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. కాలేజీల యాజమాన్యాలు కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని, దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ బతుకమ్మ, దసరా పండుగలు ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతున్నారని అన్నారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్‌లను నియమించలేదని, బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. సీఎం తన వద్దనున్న విద్యాశాఖను మరో మంత్రికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై సీఎం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రామరాపు వెంకటేశ్, మచ్చ రమేశ్, చట్ల సమ్మయ్య, కేశబోయిన రాము, సందీప్ రెడ్డి, బొల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.