Telugu Global
Telangana

మాజీ సర్పంచులేమైనా టెర్రరిస్టులా?

గ్రామాలను బాగుచేసిన వాళ్లకు ఎందుకీ శిక్ష.. మాజీ మంత్రి హరీశ్‌ రావు

మాజీ సర్పంచులేమైనా టెర్రరిస్టులా?
X

మాజీ సర్పంచులేమైనా టెర్రరిస్టులా.. వాళ్ల ఫోన్లు గుంజుకొని ఎందుకు పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సర్పంచులకు మద్దతు తెలిపేందుకు శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి ఆయన సోమవారం తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అంతకుముందు తమ పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ లో ఆందోళన చేసేందుకు వస్తోన్న మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్‌ చేసి నగరంలోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారికి సంఘీభావం తెలిపేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఠాణాకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, మాజీ సర్పంచులను అర్ధరాత్రి పూట దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్టు అరెస్ట్‌ చేయడం హేయమైన చర్య అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అప్పులు చేసి, తమ భార్యపిల్లల మీద ఉన్న బంగారం అమ్మి అభివృద్ధి పనులు చేశారని, ఆ బిల్లులు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. దేశంలోనే తెలంగాణ గ్రామాలు అత్యధిక అవార్డులు సాధించడంలో సర్పంచుల పాత్ర ఎంతో ఉందన్నారు. మంచి పనులను చేసిన మాజీ సర్పంచులను రేవంత్‌ శిక్షిస్తున్నారని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్ల బిల్లులు చెల్లిస్తూ సర్పంచులను విస్మరిస్తున్నారని అన్నారు. మూసీని రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్తోన్న రేవంత్‌ రెడ్డి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచులను అరెస్టు చేయించడం మంచిది కాదన్నారు. సర్పంచులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.





First Published:  4 Nov 2024 7:13 AM GMT
Next Story