తెలంగాణలో తల్లీబిడ్డల ప్రభావం ఎంత..? వైఎస్ షర్మిల ఎవరి ఓట్లు చీలుస్తారు ?
వైఎస్సార్..తెలుగు రాజకీయాల్లో ఓ బ్రాండ్ ఈ పేరు. ఆ ముద్ర నుంచి బయటపడి సొంత ఇమేజ్ తో ముందుకు సాగాలని ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వెస్సార్ కుమార్తె షర్మిల మాత్రం తెలంగాణలో ' రాజన్న రాజ్యం' పేరుతో తన తండ్రి రాజశేఖర రెడ్డి ప్రతిష్టను (ఇమేజ్) ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అన్న జగన్ రెడ్డి తన, తన తల్లి విజయమ్మ సేవలు పార్టీకి బాగా ఉపయోగించుకుని పక్కన బెట్టారని ఆమె కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంపై దృష్టి సారించి వైస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టిపి) స్థాపించి పాదయాత్రలు చేస్తున్నారు. ఆంధ్రా నేపధ్యం ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమేంటి అనే ప్రశ్నలకు ఆమె..తాను తెలంగాణ కోడలు కాబట్టి ఇక్కడి రాజకీయాల్లో ప్రవేశించేందుకు అర్హురాలినేనని సమర్ధించుకున్నారు. అలా ఆమె ఇక్కడి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలోనే కొడుకు పార్టీ వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఇటీవల ప్లీనరీ సమావేశంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కొడుకు జగన్ సొంత కాళ్ళపై నిలబడినట్టేనని భావించిన ఆమె ఇప్పుడు తన కూతురు షర్మిలను రాజకీయంగా నిలబెట్టేందుకు ఆమెతో జత కలిసినట్టు చెబుతున్నారు. అక్కడ వైఎస్సార్ ప్రభావం నుంచి బలపడాలని జగన్ చూస్తుంటే తండ్రి వారసత్వన్ని అందిపుచ్చుకుని రాజకీయం చేయాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు.
ఔచిత్యం ఉందా..?
రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) అధికారంలోకి వచ్చి క్రమంగా బలపడింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిహాట్రిక్ సాధించే దిశగా దూసుకుపోతొంది. వృధాగా పోతున్న నదీ జలాలను ఒడిసి పట్టి బీడు భూములుగా ఉన్న నేలను సస్యశ్యామలం చేశారు కెసిఆర్. అలాగే పారిశ్రామికీకరణలో భాగంగా దేశీయ, మల్టీనేషనల్ కంపెనీలను కూడా రాష్ట్రానికి రప్పించి స్థానికులకే ఉపాధి కల్పించేలా ప్రయత్నిస్తున్నారు. సంక్షేమం కార్యక్రమాల కింద పలు పథకాలు అమలు చేస్తూ బడుగు వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణలో షర్మిల పార్టీ రావడంలో ఔచిత్యం ఉందా..ఆంధ్రా మూలాలు ఉన్న ఆమెకు తెలంగాణ ప్రజానీకం ఎంతవరకు మద్దతునిస్తుంది అన్నది ప్రశ్న.
ముక్కోణపు పోటీ మధ్య..
తెలంగాణ పై దృష్టి పెట్టిన బిజెపి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరో వైపు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ కూడా అధికారం కోసం బలంగా పోరాడుతోంది. ఇలా ఈ మూడు పార్టీలు తలపడుతుంటే వైఎస్సార్ కూతురిగా 'రాజన్న రాజ్యం' తెస్తామంటూ తన పాద యాత్రల్లో చెబుతూ వైఎస్సార్టీపీ పేరుతో షర్మిల కూడా బరిలోకి దిగుతున్నారు. సమానత్వం, స్వావలంబనపై ఆధారపడిన అభివృద్ధి ,సంక్షేమం తన పార్టీ మార్గదర్శక సూత్రాలు అని ఆమె బహిరంగ సభల్లో చెబుతున్నారు. పనిలో పనిగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు.
ఇదే సందర్భంలో ఆ మద్య విజయమ్మ తన భర్త రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేందుకు 'వైఎస్సార్ స్మారక సభను' హైదరాబాద్ లో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా వైఎస్సార్ తో సాన్నిహిత్యం ఉన్న నాయకులను, అభిమానులను ఈ సభకు ఆహ్వానించారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ నాయకులు కొందరితో పాటు ఆయన అభిమానులు కూడా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. అయినప్పటికీ విజయమ్మ నిర్వహించిన ఈ సభ పట్ల ఆయన అభిమానులు ఆసక్తి కనబర్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ఒకరిద్దరు నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు.
అయితే ప్రాంతీయ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఉన్న తెలంగాణలో వైఎస్‌ఆర్ కూడా రాయలసీమ వ్యక్తిగానే గుర్తుండిపోతారు. ''తెలంగాణ కెసిఆర్ జాగీరా..తెలంగాణలోకి రావాలంటే ఆంధ్రా వాళ్లకు వీసా కావాలా'' అని ఏపీ అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్, టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన సందర్భాన్నిఇప్పటికీ ఇక్కడి నేతలు గుర్తుచేసుకుంటుంటారు.
ఓట్లను చీల్చగలరా..
షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతానని కూడా ప్రకటించేశారు. తల్లీ బిడ్లలు షర్మిల, విజయమ్మ కలిసి ఏ విధంగా పార్టీని ముందుకు నడిపించగలరు..ఎన్ని సీట్లు సాధించగలరు..ఎవరి ఓట్లను చీల్చగలరు..అసలు వారి ప్రభావం ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయ్యాక రెడ్డి సామాజిక వర్గం కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నట్టు కనబడుతోంది. వైఎస్సార్ కు అప్పట్లో దళిత, ముస్లిం సామాజిక వర్గాల మద్దతు కూడా ఉండేది. అయితే ప్రస్తుతం టిఆర్ ఎస్ పార్టీతో ముస్లిం పార్టీగా భావించే ఎంఐఎం మంచి అవగాహనతో ఉంది. దళిత సామాజిక వర్గం కూడా టిఆర్ఎస్ కే మద్దతుగా నిలుస్తోంది. ఈ వర్గాన్ని ఆదుకునేందుకు ఈ మధ్యే ముఖమంత్రి కెసిఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే షర్మిల తెలంగాణలో నల్గొండ,ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ జిల్లాలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాలు కావడం విశేషం. అంటే ఆమె కాంగ్రెస్ ఓటును చీల్చగలిగితే అది టిఆర్ఎస్ కు లాభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ టిఆర్ఎస్ ఓట్లను చీల్చితే అది బిజెపికి లాభం చేకూరుతుందా లేక కాంగ్రెస్ కా అనే చర్చ సాగుతోంది. అసలు ఏ మేరకు షర్మిల పార్టీ ఓట్లను చీల్చగలుగుతుందో చూడాలంటే వచ్చే ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు.