ఈ అలకలు తీర్చేది ఎవరు?
జానారెడ్డి కూడా సైలెంట్ అయ్యారని.. కావాలనే తనను బుజ్జగింపుల కమిటీలో చైర్మన్‌గా చేశారని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలిసింది.
తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి తొలి లిస్ట్ విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి మొదలైంది. ఇక రెండో జాబితా తర్వాత ఆ అసమ్మతి మరింత తీవ్రమైంది. ముఖ్యంగా పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వొద్దని మొదటి నుంచి పార్టీ సీనియర్లు కోరుతుండగా.. అధిష్టానం అందుకు విరుద్దంగా టికెట్లు కేటాయించడం ఆశావహులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీ అధికారంలో లేని కొన్నేళ్లుగా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేసిన వారిని కాదని.. కొత్త వారిని తీసుకోవడంపై చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రెండో జాబితా తర్వాత ఇలాంటి నాయకులు ఎక్కువగా అలకపాన్పును ఎక్కడ గమనార్హం.
హుస్నాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్, రేవంత్ వర్గానికి చెందిన ప్రవీణ్ ఆశించారు. అయితే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పాటు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన పొన్నం ప్రభాకర్‌కు ఆ టికెట్ కేటాయించింది. అయితే రేవంత్ రెడ్డి టికెట్ ఇప్పిస్తారనే భరోసాతో గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేసుకున్న ప్రవీణ్ రెడ్డి ఈ పరిణామంతో కలత చెందారు. రెండో లిస్ట్‌లో తన పేరు కాకుండా పొన్నం పేరు ప్రకటించడంతో అలకబూనారు.
రెండో జాబితా ప్రకటించిన వెంటనే ప్రవీణ్ వద్దకు పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్లారు. కానీ ఆ చర్చలు విఫలం అయినట్లు తెలుస్తున్నది. తనకు టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు రేవంత్‌పై ప్రవీణ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. పొన్నం అడిగినా ప్రవీణ్ మాత్రం సహకరించేందుకు ఒప్పుకోలేదని తెలుస్తున్నది.
మరోవైపు మునుగోడు టికెట్‌ను పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల క్రిష్ణారెడ్డి కూడా ఆశించారు. నిరుడు జరిగిన ఉప ఎన్నికలో టికెట్ ఆశించి భంగపడిన క్రిష్ణారెడ్డికి టికెట్ ఇప్పిస్తానని రేవంత్ భరోసా ఇచ్చారు. కానీ అప్పట్లో పార్టీని వీడి ఉపఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే తిరిగి టికెట్ కేటాయించడంతో క్రిష్ణారెడ్డితో పాటు స్రవంతి కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాగా, నల్గొండలో బలమైన నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ప్రత్యక్ష తిరుగుబాటు చేయలేక పాల్వాయి స్రవంతి, క్రిష్ణారెడ్డి లోలోపలే బాధపడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
దీంతో పాటు పలు ఇతర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పార్టీ మారడం లేదా రెబెల్‌గా పోటీ చేయడంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. మునుగోడు నుంచి రెబెల్‌గా బరిలో దిగేందుకు క్రిష్ణారెడ్డి నిర్ణయించకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఈ అలకలను తీర్చేందుకు జానారెడ్డి కమిటీ ఏ మాత్రం చొరవ చూపడం లేదు.
ఇప్పటికే మిర్యాలగూడ టికెట్ ఆశించిన జానారెడ్డి కుమారుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో జానారెడ్డి కూడా సైలెంట్ అయ్యారని.. కావాలనే తనను బుజ్జగింపుల కమిటీలో చైర్మన్‌గా చేశారని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నుంచి విష్ణవర్దన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్థన్ రెడ్డి టికెట్లు ఆశించినా దక్కలేదు. దీంతో వాళ్లు బీఆర్ఎస్‌లో చేరారు. ఇలాంటి కీలకమైన నాయకుల అలకలు తీర్చేందుకు నియమించిన కమిటీ పూర్తిగా విఫలం అయ్యిందని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
కీలకమైన నాయకులను, వారి అనుచరగణాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని.. ఇది తప్పకుండా ఎలక్షన్‌పై ప్రభావం చూపుతుందని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్‌లో అలకలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పూర్తిగా విఫలమైందనే చర్చ జరుగుతోంది.